ఏపీలో మందుబాబులకు శుభవార్త.. లిక్కర్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకుబోతోంది. రాష్ట్రంలో 2019 కంటే ముందున్న తరహా విధానాన్నే మళ్లీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులు చేసి ఏపీలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రైవేటుకే అప్పగించనుంది. ఒక వ్యక్తి నుంచి ఎన్ని షాపులకైనా దరఖాస్తులు స్వీకరించాలని.. వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారట.
ఈ మద్యం పాలసీ, టెండర్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ రుసుము విధించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఈ మేరకు వారు సమర్పించిన నివేదికలు, కన్సల్టెన్సీ టీమ్ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ.. వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఏపీలో మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డీపీఎల్) అరికట్టేందుకు వీలవుతుందని భావిస్తున్నారట. ఏపీలో నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. అధ్యయన నివేదికలు, ఎక్సైజ్‌శాఖ ప్రాథమిక ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష చేయనుంది.
ఈ కమిటీ మద్యం వ్యాపారం, ధరలు, పన్నులపై ప్రధానంగా చర్చించనుంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంని… ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరో వారం రోజుల్లో మద్యం విధానాన్ని ఖరారు చేస్తారు.. అయితే సెప్టెంబరు 5 నుంచి ఎక్సైజ్‌లో బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మద్యం విధానం ఖరారు, దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సుల కేటాయింపు వంటి ప్రక్రియ అంతా సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. అక్టోబరు 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. అంతేకాదు గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెబ్‌ను రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రభుత్వం రద్దుచేసింది. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సెబ్‌లోని 70% సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకు రానున్నారు. మద్యం పాలసీతో పాటుగా ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా ఫోకస్ పెట్టారు. అంతేకాదు మంచి బ్రాండ్‌లను కూడా అందుబాటులోకి తేస్తామని చెబుతోంది ప్రభుత్వం.