ఆ నగరాలతో పోలిస్తే అమరావతి సేఫ్‌.. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు..

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు అపారనష్టం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా కుండపోత వర్షాలు కురిశాయి. అయితే అమరావతి మునిగిపోయిందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి సేఫ్‌ అని ప్రకటించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటపాలెం కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం పూర్తిగా నీట మునిగిపోయింది. కరకట్ట దగ్గర భారీగా నీళ్లు లీకవుతున్నాయి. ఆశ్రమంలో ఉన్నవాళ్లను తాళ్ల సాయంతో కిందకు దింపారు.

కరకట్ట దగ్గర లీకేజ్‌ ఉండటంతో రాత్రంతా ఉండి అధికారులు దాన్ని పూడ్చారు. కాని వరద ఉధృతి అధికంగా ఉండటంతో మళ్లీ నీళ్లు లీకవుతున్నాయి. ఆశ్రమం పూర్తిగా మునగడంతో అందర్నీ బయటకు తీసుకొచ్చేశారు.. కృష్ణానదిలో ప్రవాహం అధికంగా ఉండటం వల్ల పంటకాలువ బొదెల నుంచి నీరు వెంకటపాలెంలోకి వస్తోంది. ఆశ్రమం దగ్గర బలహీనంగా ఉన్న కరకట్ట ప్రాంతాన్ని అధికారులు ఇసుకతో నింపారు. పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. లీకేజీని అరికట్టేందుకు స్థానికులు ఇనుప బోర్డులు తెచ్చారు. కరకట్ట లీకేజ్‌ ప్రాంతానికి మంత్రి నిమ్మల రామానాయుడు, CRDA కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ కూడా వచ్చారు. పరిస్థితి పరిశీలించాక.. అందరినీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు..
11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికి..

రాజధాని అమరావతి ప్రాంతం సురక్షితంగా ఉందని.. అమరావతి సేఫ్ అంటూ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.. 11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికి అమరావతి ప్రాంతం చెక్కు చెదరలేదన్నారు. అమరావతిపై విషం చిమ్మడం విపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ , చెన్నై నగరాలతో పోలిస్తే అమరావతికి వరదముప్పు తక్కువగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.