‘స్కూళ్లలో విద్యార్ధులు టాయిలెట్లు శుభ్రం చేస్తే తప్పేంటీ?’ ఎంపీ గోవింద్ కార్జోల్

www.mannamweb.com


ఉపాధ్యాయ దినోత్యవం సందర్భంగా చిత్రదుర్గ ఎంపీ కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ కార్జోల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విద్యార్థులు బడుల్లో మరుగుదొడ్లు శుభ్రం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తే తప్పేంటి? జపాన్‌లో టీచర్లు, విద్యార్థులు ఈ పని చేస్తారు. నేను చదువుకునేటప్పుడు హాస్టల్‌ను ఊడ్చి, కడిగే వాడిని. విద్యార్థులతో ఉపాధ్యాయులు మరుగుదొడ్లు శుభ్రం చేయించే వీడియోలు బయటకు వచ్చినప్పుడల్లా నానాయాగి చేస్తారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు. విద్యార్థులకు చీపురు ఇవ్వడాన్ని నేరంగా చూస్తున్నారు. అందుకే శుభ్రం చేసే పనిని విద్యార్థులు తక్కువగా చూస్తున్నారు. అందుకే విద్యార్థులకు శుభ్రత గురించి చెప్పడం తప్పనిసరి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

శుభ్రతకు సంబంధించిన పనులను విద్యార్థులతో చేయిస్తే వివక్ష లేకుండా, అందరూ రొటేషన్‌ పద్ధతిలో చేసేలా చూడాలని, ఐదో తరగతి పైన చదువుతున్న వారితోనే ఈ పని చేయించాలి, టాయిలెట్లలో సరైన నీటి సౌకర్యం ఉండాలని ప్రొఫెసర్‌ సీతారాము అభిప్రాయపడ్డారు. దీనిపై ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ చేంజ్‌ మాజీ ప్రొఫెసర్‌ సీతారాము మాట్లాడుతూ.. విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని చెప్పడం చాలా సులభమని, అయితే దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లలతో మాత్రమే ఈ పని చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాచరణను పర్యవేక్షించే యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్రంలోని పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, తద్వారా విద్యార్థులు తాము చేయాలనుకున్నది చేయవచ్చని అన్నారు.

కాగా ఎంపీ గోవింద్ కార్జోల్ తాజా వ్యాఖ్యలపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇది పిల్లలకు బోధించాల్సిన పాఠమే అయినప్పటికీ ఇందులో కుల వివక్ష చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.