తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చక్కెర తీసుకోవడం వల్ల కలిగే ఎన్నో దుష్ప్రభావాలకు తేనెతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందుకే చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. తేనెలోని మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు, బరువు తగ్గడంలో కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. అయితే తేనెతో మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ రోజూ తేనె తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. తేనెలో ట్రెహలోజ్ అనే చక్కెర పదార్థం ఉంటుంది. ఈ ట్రెహలోజ్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండడంలో ఇది ఉపయోగపడుతుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎలుకల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేసి పరిశోధించారు. ట్రెహలోజ్ గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎలుకల్లో గుండె ఆరోగ్యం మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. తేనెలోని ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్ చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఈ కారణంగానే తేనె గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.
ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లో, ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లో మాత్రం ప్లాక్ తగ్గుదల కనిపించలేదు. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్ అనే ఒక రకం ఇమ్యూన్ కణాలు చేస్తుంటాయి. మ్యాక్రోఫేజ్ కణాలను పుట్టించడానికి అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రొటీన్ ఉత్పాదనకు ట్రెహలోజ్ ఉపయోగపడుతుందని పరిశోధల్లో వెల్లడైంది.
రక్తంలోని పాచిని తొలగించడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.