ఏపీ, తెలంగాణకు తుఫాన్ ముప్పు..ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ

www.mannamweb.com


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణాను వరుణ దేవుడు ఇప్పట్లో వదిలి వెళ్లేలా కనిపించడం లేదు. గత 20 రోజుల క్రితం భారీ వర్షాలు దంచికొట్టాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండలా మారాయి. వర్షాలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించింది ప్రభుత్వం. పదరోజులుగా కాస్త బ్రేక్ ఇచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొడతాయిన వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

ఏపి, తెలంగాణకు మరోసారి వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇరు రాష్ట్రాల్లో రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. రేపు శనివారం ఆదిలాబాద్, భూపాల్ పల్లి, ములుగు, కొత్త గూడెం, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల,జనగాం, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతుంది. విపరీతమైన గాలులు పశ్చిమ వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయి. రానున్న మడు రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి, కోనసీమ, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి వర్షాలు పడతాయని.. తీర ప్రాంతం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవొదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.