ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్‌ H సక్సెస్‌.. మూడో బోటును బయటకు తీసిన ఇంజనీర్లు

www.mannamweb.com


ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్‌ H సక్సెస్‌ అయ్యింది. విజయవంతంగా మూడో బోటును బయటకు తీశారు ఇంజనీర్లు. రెండు వారాలుగా బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగింది. ఇక బ్యారేజీ మెయింటెన్స్‌ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకుపోయి.. మునిగిపోయిన మూడవ పడవను విజయవంతంగా తొలగించారు. 40 టన్నుల బరువున్న బోటు 69వ గేట్‌ను ఢీకొట్టింది. దానిని వెలికితీసేందుకు అధికారులు సమన్వయంతో ప్రయత్నించారు. రికవరీ ఆపరేషన్‌లో భాగంగా.. చిక్కుకుపోయిన పడవను ఇనుప గడ్డర్‌లతో మరో రెండు బోట్‌లకు కనెక్ట్ చేశారు. చైన్ పుల్లర్‌లను ఉపయోగించి దాన్ని పైకి లాగారు.

బోటును తొలుత బ్యారేజీ పైకి తరలించారు. అక్కడి నుంచి పున్నమి ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న మొత్తం మూడు భారీ బోట్లను బీకేమ్ ఇన్‌ఫ్రాకు చెందిన ఇంజనీర్లు, అధికారులు విజయవంతంగా వెలికితీశారు. ఆపరేషన్‌ H పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు ఈనెల 9న అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు.. కార్యకర్తలవని నిర్ధారించారు. ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునే వారని చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామని అధికారులు వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని చెప్పారు. సహజంగా మూడింటిని కలిపి కట్టరని నివేదికలో వివరించారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినట్టు నివేదికలో వివరించారు. అవి గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్‌లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదన్నారు.

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఘటనపై శుక్రవారం మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు. విజయవాడను వరదలు ముంచెత్తడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. వరదల సమయంలో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వారి దృష్టిని మరల్చడానికి బోట్ల డ్రామా తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే బోట్ల అంశాన్ని వాడుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు.