తిరుపతి లడ్డూ వివాదంలో నెయ్యి సరఫరాదారుడికి ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు

www.mannamweb.com


తిరుపతి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది.

తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది.

గత నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి తమకు సమాచారం అందిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.

టీటీడీకి సరఫరా చేసిన శాంపిళ్లను పరీక్షల నిమిత్తం గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపింది.

“మీ సంస్థ M/s ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎస్ఏఐ సెంట్రల్ లైసెన్స్ నంబర్ 10014042001610) నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైంది. మీ సంస్థను టీటీడీ ఈవో బ్లాక్ లిస్టులో పెట్టారు..’ అని నోటీసులో పేర్కొన్నారు.

“మీ సంస్థ తయారు చేసిన “నెయ్యి” ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల, మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, నియమనిబంధనలను ఉల్లంఘించారు.’’ అని పేర్కొన్నారు.

“ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 యొక్క పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు మీ సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదో కారణం చూపాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాం” అని నోటీసులో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 23లోగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రెగ్యులేషన్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరుపతి లడ్డూలో నాసిరకం పదార్థాలు, జంతు కొవ్వును ఉపయోగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో హిందూ దేవాలయాల పవిత్రతను, వాటి ‘ప్రసాదాలను’ పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.