గాన గంధర్వుడికి అరుదైన గౌరవం.. ఆ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు..

www.mannamweb.com


సినీ సంగీత ప్రపంచంలో తన గానంతో ఎంతో మంది శ్రోతలను అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలతోపాటు దాదాపు 16 భాషలలో వేలాది పాటలు పాడి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు.

అద్భుతమైన గాత్రంతో సినీ సంగీత ప్రియులను అలరించిన ఆ మధుర గాయకుడిని కోల్పోయి నాలుగేళ్లు అయిపోయింది. 2020లో కరోనా మహమ్మారి ఆయనను తీసుకెళ్లిపోయింది. ఆయన మన మధ్య లేకపోయినా.. ఇప్పటికీ ఆయన పాడిన పాటలు మన మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. ఆయన పాడిన పాటలు అజరామరం. ఈరోజు (సెప్టెంబర్ 25న) నాలుగో వర్దంతి సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన పాడిన అద్భుతమైన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఎస్పీ బాలును గుర్తుచేసుకుంటూ ఆయన పాడిన పాటలను సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఎస్పీ బాలుకు మరో గౌరవాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఆ రోడ్డుతో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకు ఇచ్చే గౌరవం అవుతుందని అన్నారు. ఇక ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాల్గవ వర్దంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇకపై కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలని సీఎం ప్రకటించారు. సీఎం స్టాలిన్ నిర్ణయం పట్ల సంగీత ప్రియులు, ఎస్పీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏపీలోని నెల్లూరు జిల్లాలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలు సంగీతం పట్ల ఉన్న అభిరుచితో గాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఎస్పీ కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న బాలు.. తెలుగుతోపాటు మిగతా భాషల్లోనూ వేలాది పాటలు పాడి అనేక అవార్డ్స్ అందుకున్నారు.