వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు

www.mannamweb.com


తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు జ‌రిగే తొమ్మిది రోజులు వేలాది మంది భ‌క్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

తూర్పుగోదావ‌రి జిల్లా ప్రజ‌లు అతి ప‌విత్రంగా చూసే రాయ‌వ‌రం మండలంలోని వెదురుపాక విజ‌య‌దుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు 53వ శ‌రన్నవ‌రాత్రి ఉత్సవాల‌ను నిర్వహించ‌నున్నారు. ఉత్సవాల నిర్వహ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాలు జ‌రిగే తొమ్మిది రోజులు వేలాది మంది భ‌క్తులు హాజరై పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అమ్మవారికి ఏ రోజు, ఏ అలంక‌ర‌ణ

తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మవారిని తొమ్మిది ర‌కాలుగా అలంకరిస్తారు. అక్టోబ‌ర్ 3వ తేదీన ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి హ‌స్త న‌క్షత్రంలో ఉద‌యం 8:19 గంట‌ల‌కు అమ్మవారి మూల విరాట్ వ‌ద్ద క‌ల‌శ‌స్థాప‌న‌తో కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అదే రోజు విజ‌య‌దుర్గ అమ్మవారిని బాలా త్రిపుర సుంద‌రీదేవిగా అలంక‌రిస్తారు. అలాగే అక్టోబ‌ర్ 4 తేదీన‌ గాయ‌త్రీ దేవీగానూ, అక్టోబ‌ర్ 5 తేదీన అన్నపూర్ణాదేవిగానూ అలంక‌రిస్తారు.

అక్టోబ‌ర్ 6 తేదీన ల‌తితా త్రిపుర సుంద‌రీ దేవీగానూ, అక్టోబ‌ర్ 7 తేదీన ర‌జ‌త క‌వ‌చ విజ‌య‌దుర్గాదేవి గానూ అమ్మవారిని అలంకరిస్తారు. అక్టోబ‌ర్ 8 తేదీన మ‌హాల‌క్ష్మీదేవిగా, అక్టోబ‌ర్ 9 తేదీన స‌రస్వతీ దేవిగా, అక్టోబ‌ర్ 10 తేదీన దుర్గాదేవిగా అలంక‌రిస్తారు. అక్టోబ‌ర్ 11 తేదీన‌ మ‌హిషాసుర‌మ‌ర్ధని దేవీ అవ‌తారంలోనూ, అక్టోబ‌ర్ 12న రాజ‌రాజేశ్వరిదేవీ అవ‌తారంలో… విజ‌య‌దుర్గాదేవి అలంక‌ర‌ణ‌లో అమ్మవారు భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు.

ఈ తొమ్మిది రోజుల పాటు తూర్పుగోదావ‌రి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని ద‌ర్శించుకోవాడానికి వెదురుపాక విజ‌య‌దుర్గా పీఠానికి వెళతారు. భ‌క్తి శ్రద్ధల‌తో పూజులు చేస్తారు. ఆ తొమ్మిది రోజులు వియ‌దుర్గా పీఠంలో భ‌క్తుల‌ కోలాహ‌లం కనిపిస్తుంది. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది జ‌రిగే ఈ శ‌వ‌న్నవ‌రాత్రి ఉత్సవాలు గ‌త 52 ఏళ్లుగా నిర్విరామంగా జ‌రుగుతున్నాయి.

వెదురుపాక విజ‌య‌దుర్గా పీఠంలో 1974 సంవత్సరంలో తొలిసారి అమ్మవారి పాద ముద్రిక‌లు ఏర్పడ్డాయని చెబుతుంటారు. శ‌ర‌న్నవ‌రాత్రుల‌ను పుర‌స్కరించుకుని రోజూ పీఠంలో ప‌లు ర‌కాల పూజ‌లు నిర్వహిస్తారని పీఠం అడ్మినిస్ట్రేట‌ర్ వీవీ బాపిరాజు తెలిపారు.