వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్- డిజిల్ ధర రూ.10 తగ్గనుందా?

www.mannamweb.com


భారతదేశంలో పెట్రోల్- డీజిల్ ధరల విషయంలో ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ధరలు మండిపోతున్నాయి, ఇంకా ఎప్పుడు ధరలు తగ్గిస్తారు అంటూ వాహనదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఆశావహులకు ఒక శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్- డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గే అవకాశం ఉంది అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు ఇప్పుడు ఒక థియరీ చెబుతున్నారు. దాని ప్రకారం చూస్తే ఇండియాలో పెట్రోల్ లీటరుకు 10 రూపాయల వరకు.. డీజిల్ లీటరుకు 6 రూపాయల వరకు తగ్గే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఆ థియరీ ఏంటి? నిజంగానే పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టేందుకు ఛాన్స్ ఉందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆయిల్ ధరలను గతంలో అయితే ప్రభుత్వం నిర్ణయించేది. ప్రభుత్వం ఏ ధర చెబితే అదే ధరకు పెట్రోల్- డీజిల్ విక్రయించాల్సి ఉంటుంది. అయితే తర్వాత ఆ పద్ధతికి స్వస్తి పలికారు. 2010లో పెట్రోల్ మీద ఆ విధానాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2014లో డీజిల్ మీద కూడా ప్రభుత్వం ధరను నిర్ణయించే విధానానికి స్వస్తి పలికారు. అప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్ ప్రకారమే ఇండియాలో కూడా పెట్రోల్- డీజిల్ ధరలు ఉంటాయని వెల్లడించారు. దానిని మార్కెట్ డ్రివెన్ మెకానిజం అని చెబుతారు. ఈ విధానం వల్ల అంతిమంగా వినియోగదారులకే మేలు జరుగుతుందని ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి. అంటే గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది అనేది వాళ్ల వాదన. అయితే గ్లోబల్ మార్కెట్లో ఎన్నిసార్లు క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధరలు తగ్గినా కూడా ఇండియాలో పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గలేదు అనేది వినియోగదారుల వాదన. అందులో నిజం కూడా లేకపోలేదు. ధరలు పెరిగినప్పుడు కచ్చితంగా పెంచడం చూశాం. కానీ, క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గించడం చూడలేదు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం బ్యారల్ ధర రూ.71 డాలర్స్ గా నడుస్తోంది. మనకు ఆగస్టు 2021 తర్వాత క్రూడ్ ఆయిల్ ధర ఇదే కనిష్టం. ప్రపంచ దేశాల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అందుకే ఇండియాలో పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? అంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మనకు పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గలేదు. ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి అని చెప్పడానికి కారణం గ్లోబల్ మార్కెట్ కాదు. ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ధరలు తగ్గుతాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గవు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గిపోతాయి.

ప్రస్తుతం హరియాణా ఎన్నికల ఫలితాలు పెట్రోల్- డీజిల్ ధరల మీద ప్రభావం చూపబోతున్నాయి అనేది నిపుణుల అభిప్రాయం. హరియాణా ఎన్నికల్లో కేంద్రానికి స్పష్టమైన మెజారిటీ దక్కితే మాత్రం ఇంధన ధరలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ, కాంగ్రెస్ గనుక స్పష్టమైన హవా కనబరిస్తే ఇంధన ధరలు తగ్గచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత కేంద్రానికి ఎంతో అవసరమైన ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్ మూడు, నాలుగు వారాల్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం కేంద్రం కచ్చితంగా పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గిస్తుంది అని చెబుతున్నారు. పెట్రోల్ మీద లీటరుకు 10 రూపాయలు, డీజిల్ మీద లీటరుకు 6 రూపాయల వరకు ధరలు తగ్గచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హరియాణా ఫలితాల్లో కేంద్రానికి సానుకూల ఫలితాలు వస్తే మాత్రం ధరల్లో మార్పులు ఉండకపోవచ్చు.