నవరాత్రుల నేపథ్యంలో విజయవాడలో ఆలయాల భద్రత కట్టుదిట్టం

www.mannamweb.com


దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4500మంది పోలీసులతో దసరా ఉత్సవాలకు భద్రత కల్పిస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ జిల్లా వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.దసరా ఏర్పాట్లలో భాగంగా నగర వ్యాప్తంగా సుమారు 4500 మంది పోలీసులను మోహరించనున్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు విజయవాడలో కమాండ్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

సీసీటీవీ నిఘాతో పాటు ఆలయాల చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షించేందుకు డ్రోన్లను కూడా ఉపయోగిస్తామని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. శాంతిభద్రతల విధుల కోసం 2500 మంది పోలీసులు, 27 ప్లాటూన్ల బలగాలను మోహరించనున్నట్లు పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు.

200 మంది సభ్యులతో కమాండ్ సెంటర్ నిర్మించబోతున్నామని, 4500 మంది పోలీసులతో స్వామివారి దర్శనం సజావుగా సాగుతుందని తెలిపారు. ఈసారి సిబ్బంది అందరికీ షిఫ్ట్ టైమింగ్స్ ఉండేలా వినూత్న చర్యలు తీసుకుంటున్నాం. కమాండ్ సెంటర్ కూడా టెక్నాలజీ ఆధారితంగా ఉంటుందని, 20 డ్రోన్లు ఉంటాయని తెలిపారు. గత ఏడాది కంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాజశేఖర్ బాబు తెలిపారు.

గతేడాది 13 లక్షల మంది భక్తులు రాగా, ఈసారి 16-17 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలందించి త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించి ఉత్సవాలు విజయవంతం చేయాలని సీపీ సూచించారు.

క్యూలైన్ల‌లో వేచి ఉండే భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిపించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి 27 ప్రాంతాలలో తాగునీటి బాటిల్స్ సరఫరా చేసేందుకు మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించినట్టు తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం లగేజీ, చెప్పులు భద్రపరుచుకునేందుకు 30 క్లాక్ రూములను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీ, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారికి దర్శనం కల్పించి సామాన్య భక్తులకు ఇబ్బంది కల‌గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామన్నారు.