నేడో రేపో నోటిఫికేషన్‌

www.mannamweb.com


మద్యం షాపుల మార్గదర్శకాలు ఖరారు
10 లోపు లైసన్స్‌ల జారీ ప్రక్రియ పూర్తికి కసరత్తు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఒకటి, రెండు రోజుల్లో వెలువడనుంది.

ప్రైవేట్‌ వ్యక్తులే మద్యం షాపులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. నూతన మద్యం పాలసీ గవర్నర్‌ ఆమోదం పొంది న్యాయశాఖకు పంపారు. అక్కడ నుండి రాగానే నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ మొత్తం ఈ నెల 10, 11తేదీల్లోపు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సాంకేతింగా అక్టోబర్‌ 1 నుండే నూతన మద్యం పాలసీ అమలులో వున్నా ఆచరణలోకి వచ్చే సరికి 10,11వ తేదీల దాకా సమయం పట్టవచ్చని అధికారులు అంచనా. రాష్ట్రంలో మొత్తం 3,736 షాపులను తెరవబోతున్నారు. ఇందులో 10శాతం దాదాపు 340 షాపులను కల్లుగీత కార్మికుల కుటుంబాలకు కేటాయించనున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు.

కొత్త షాపులు అందుబాటులోకి వచ్చేదాకా ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా నిలిచిపోయిన బ్రాండెడ్‌ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ రిటైల్‌ విధానంలో అమ్మకాలు సాగించనున్నారు. ఇందుకోసం లైసెన్స్‌ ఫీజులను సైతం ఖరారు చేశారు.

ఈ నూతన విధానం రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఎక్కువగా రిటైలర్లను భాగస్వామ్యం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ధరకే బ్రాండెడ్‌ మద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఇదే హామీ ఇచ్చారు.

ఇప్పుడు అమలు చేయడానికి చర్యలను చేపట్టారు. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ ధర తెలంగాణాలో రూ 140లు వుండగా కర్నాటకలో రూ 80లు వుంది. రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ కనిష్ట ధర రూ 99లుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అలాగే ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్‌ షాపులకు సైతం ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 షాపులను ఏర్పాటు చేయనున్నారు.