ఇక డయాబెటిస్‌కు గుడ్‌బై.. చైనా శాస్త్రవేత్తల విజయం

www.mannamweb.com


జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా ఉంది.

సాధారణంగా మధుమేహం రెండు రకాలు – టైప్-1, టైప్-2. టైప్-1 మధుమేహం విషయంలో రోగుల ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. అటువంటి పరిస్థితిలో దీనితో బాధపడుతున్న రోగులు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి. అదే సమయంలో టైప్-2 మధుమేహం జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా నియంత్రించవచ్చు. ఇప్పుడు టైప్ 1 డయాబెటిస్ చికిత్సకు సంబంధించి ఒక శుభవార్త వెలుగులోకి వచ్చింది. టైప్ 1 డయాబెటిస్ కు చైనా శాస్త్రవేత్తలు చెక్ పెట్టారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ‘టైప్-1’ మధుమేహం ఉన్న వృద్ధ రోగిని నయం చేశామని పేర్కొన్నారు.

సర్జరీకి అరగంట మాత్రమే పట్టింది:

చైనా వార్తాపత్రిక ‘ది పేపర్’ నివేదిక ప్రకారం.. 25 ఏళ్ల మహిళ చాలా కాలంగా టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతోంది. అటువంటి పరిస్థితిలో చైనా శాస్త్రవేత్తలు ఆమెకు స్టెమ్ సెల్ మార్పిడి చేశారు. ఈ శస్త్రచికిత్స జరిగిన రెండున్నర నెలల తర్వాత ఈ మహిళ షుగర్ లెవెల్ అదుపులోకి వచ్చింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ శస్త్రచికిత్సకు అరగంట మాత్రమే పట్టింది.

స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా మధుమేహాన్ని నియంత్రించిన బృందం గత వారం ‘సెల్’ జర్నల్‌లో తన ఫలితాలను ప్రచురించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో ‘టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పెకింగ్ యూనివర్సిటీ’ పరిశోధకులు కూడా ఉన్నారు.

ఇంతకుముందు చికిత్స ఎలా జరిగిందంటే..

ఇప్పటి వరకు టైప్ 1 డయాబెటిస్ రోగులను నయం చేయడానికి, మరణించిన దాత ప్యాంక్రియాస్ నుండి ఐలెట్ కణాలను సేకరించి, టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తి కాలేయంలోకి అమర్చారు. ప్యాంక్రియాస్‌లోని ‘ఐలెట్’ కణాలు ‘ఇన్సులిన్’, ‘గ్లూకాగాన్’ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి రక్తంలో ‘గ్లూకోజ్’ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే దాతలు లేకపోవడంతో చేయడం కష్టంగా మారింది.

ఇప్పుడు చికిత్స విధానం ఏంటి?

ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ మధుమేహం చికిత్సకు కొత్త అవకాశాలను వచ్చాయని పరిశోధకులు అంటున్నారు. ఈ చికిత్స ప్రక్రియ రసాయనికంగా ప్రేరేపించిన ప్లూరిపోటెంట్ స్టెమ్-సెల్ ఉత్పత్తి చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఈ ప్రక్రియలో రోగి నుండి కణాలను తీసుకొని వాటిలో కొన్ని రసాయన మార్పులు చేస్తారు. అప్పుడు అది తిరిగి రోగి శరీరంలోకి పంపిస్తారు. తాజాగా తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు లైన్‌ క్లీయర్‌ అయినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విధానం ద్వారా టైప్‌-1 మధుమేహ బాధితుల నుంచి ముందుగా అడిపోజ్‌ కణాలను సేకరిస్తారు. రసాయనిక ప్రక్రియలతో వాటిని ప్లూరీపొటెంట్‌ స్టెమ్‌ సెల్‌లు గా రీప్రోగ్రామ్‌ చేస్తారు. అనంతరం ఆ సెల్స్‌ను ఐలెట్‌ కణాలుగా మార్చి.. తిరిగి బాధితుల శరీరంలో ప్రవేశపెడతారు. అయితే శస్త్రచికిత్స జరిగిన 75 రోజుల తర్వాత ఆమె ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవడం పూర్తిగా మానేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా టైప్‌ 1 డయాబెటిస్‌ పూర్తిగా నయం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.