రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దసరాలోపు వారికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు..

www.mannamweb.com


ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పీడ్ పెంచుతోంది. దానిలో భాగంగా.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, భూముల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిష్కారం, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారుల ఎంపిక, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లాంటి కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా.. డిజిటల్‌ కార్డుల జారీకి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు గ్రామాల్లో ప్రయోగాత్మక సర్వేను నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇంటింటి పరిశీలన చేపట్టి ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి ఈ నెల 8వరకు పూర్తి చేయాలన్నారు.

పేద, మధ్య, ధనిక వర్గాలు, కుటుంబాలు అనే తేడా లేకుండా తెలంగాణలోని ఉన్న ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, యూనిక్ నెంబర్‌తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్ధేశ్యమన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం హయాంలో పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను దసరాలోపు లబ్దిదారులకు అందజేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ కన్వీనర్‌గా మరికొంతమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇక.. భూముల క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యాలకు వేర్వేరుగా కేంద్రాలను నెలకొల్పి ఈ నెల 15వ తేదీ నాటికి ప్రతీ మండలంలో కనీసం ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. సన్న ధాన్యానికి 500 బోనస్‌ వర్తింపజేసి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి పొంగులేటి సూచించారు.