తెలంగాణ డీఎస్సీ ఫలితాలు సోమవారం (సెప్టెంబర్ 30) విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విద్యాశాఖ జిల్లాల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
డీఎస్సీ ఫలితాల్లో ఏపీకి చెందిన పలువురు అభ్యర్ధులు సత్తా చాటి ఆశ్చర్యపరిచారు.
విశాఖపట్నానికి చెందిన యువతి రెండు కేటగిరీల్లో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. విశాఖలోని పీఎంపాలెం ప్రాంతానికి చెందిన రెడ్డి మహాలక్ష్మి 2022లో హిందీ లాంగ్వేజ్ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఇక 2023లో ఎంఏ హిందీ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పరీక్షలకు సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో మహాలక్ష కూడా పాల్గొంది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా తొలిసారి తెలంగాణ డీఎస్సీకి దరఖాస్తు చేసి నాన్‌లోకల్ కోటాలో హైదరాబాద్ జిల్లాను ఎంచుకుని పరీక్ష రాసింది. సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో లాంగ్వేజ్ పండిట్ హిందీలో 79.97 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ హిందీలో 71.47 మార్కులు సాధించి ఆ జిల్లా పరిధిలో ఫస్ట్ ర్యాంకు దక్కించుకుంది. దీంతో రెండు కొలువులు ఒకే సారి దక్కడంతో మహాలక్షి ఆనందం వ్యక్తం చేసింది. తన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, తల్లిదండ్రుల సహకారం వల్లే తనకు విజయం సాధ్యమైందని తెలిపింది.
గణితంలో మెరిసిన విజయనగరం కుర్రోడు
తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో విజయనగరంలోని భవానీనగర్‌కు చెందిన కేవీఎస్ శ్రీరామ్.. డీఎస్సీ ఫలితాల్లో గణితంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీరామ్ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ పరీక్ష రాసి.. సచివాలయం సంక్షేమ సహాయకునిగా ఎంపికయ్యాడు. అయితే డీఎస్సీ కొట్టాలనే లక్ష్యం అలాగే ఉండిపోవడంతో కొద్ది నెలలకే ఆ ఉద్యోగం వదులుకుని ప్రిపరేషన్ ప్రారంభించాడు. కష్టపడి చదవడం ప్రారంభించాడు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన డీఎస్సీ రాసిన కేవీఎన్ శ్రీరామ్ స్కూల్ అసిస్టెంట్ గణితంలో 100కు 84.83 మార్కులతో ఫస్ట్ ర్యాంకు చాధించాడు. అంతేకాదు శ్రీరామ్ 2022, 2023 తెలంగాణ టెట్‌లోనూ ప్రతిభ కనబరిచాడు. రెండు సార్లు వరుసగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీకి కూడా సిద్ధమవుతున్నాడు.
కాగా తెలంగాణ డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలవడంతో అన్ని జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ధ్రువపత్రాల పరిశీలన చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు పరిశీలన జరుగుతుంది. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా విద్యాశాఖ అధికారులు సమాచారం అందిస్తున్నారు.