బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అపశ్రుతి.. ఆందోళనలో అర్చకులు

www.mannamweb.com


తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయానికి ముందు ఉన్న ధ్వజ స్తంభంపై ఉన్న ఇనుప కొక్కెం విరిగిపడింది. సాయంత్రం ధ్వజారోహణంలో ఈ ధ్వజస్తంభంపైనే గరుడ పఠాన్ని అర్చకులు ఎగురవేసి.. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు భావిస్తారు. సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం ధ్వజస్తంభం కొక్కి పరిశీలిస్తుండగా.. అది విరిగిపోయినట్టు గుర్తించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగకపోవడంతో అర్చకులు అయోమయానికి గురయ్యారు. అప్రమత్తమైన వారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయానికి చేరుకున్నారు. తక్షణమే అర్చకులు ధ్వజస్తంభం పైకి వెళ్లి మరమ్మతు పనులు ప్రారంభించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొక్కెం అతికించే ప్రక్రియ చేపట్టామని టీటీడీ వర్గాలు తెలిపాయి.

సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించాల్సి ఉంది. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకుని, రాత్రికి అక్కడ బస చేసి.. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని గత నెలలో సీఎం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం తర్వాత ఆయన మొదటిసారి తిరుమలకు వస్తున్నారు. శ్రీవారికి ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. అధిక మాసంలో రెండుసార్లు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మదేవుడు జరిపించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి.