హీరో నాగార్జునపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

www.mannamweb.com


హీరో అక్కినేని నాగార్జునకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ మహిళా మత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. మంత్రి కామెంట్స్ తో ఇటు రాజకీయ వర్గాలతో పాటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర ధుమారం రేగింది. నాగ్ కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలను తెలుగు ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండించింది. నాగ్ ఫ్యామిలీకి అండగా నిలిచింది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున సురేఖపై లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో నాగార్జునకు మరో షాక్ తగిలింది. ఎన్ కన్వెన్షన్ వివాదం నాగ్ ను వెంటాడుతోంది.

జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో నాగ్ పై ఫిర్యాదు చేశాడు. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులను కోరారు. తమ్మిడికుంట చెరువు కబ్జాచేసి Nకన్వెన్షన్‌ నిర్మించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. నాగార్జున చెరువును ఆక్రమించుకుని పర్యావరణాన్ని విధ్వంసం చేశాడని, చట్టాలను ఉల్లంఘించాడని బాస్కరరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌కు పంపించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్, నాళాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మితమైన అక్రమ కట్టడాలను నిర్థాక్షిణ్యంగా కూల్చివేస్తోంది హైడ్రా. హైడ్రా దెబ్బకు అక్రమార్కులు వణికిపోతున్నారు.

అయితే హైడ్రా చర్యలు సామాన్యుల పాలిట శాపంగా మారడంతో ప్రజల నుంచి వ్యతిరేఖత వస్తోంది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ హైడ్రాకు విసృత అధికారాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా హైడ్రా కూల్చివేతల్లో పేదలు, ధనికులు అన్న భేదం లేకుండా తనపని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌‌ను ఇటీవలే హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్‌‌ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చివేసింది.

ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసి హీరో నాగ్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కూల్చివేతతో హైడ్రా ఒక్కసారిగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కాగా దాని పై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందడంతో, పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి..కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగార్జున పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి. మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడలి.