రేపే బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడోత్సవం.. భారీ బందోబస్తు.. వాహనాల్లో వెళ్ళే భక్తులకు పలు సూచనలు..

www.mannamweb.com


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరువీధులు భక్తులతో నిండిపోయి. గోవింత నామస్మరణలతో మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఈ రోజు శ్రీవారికి కల్పవృక్ష వాహనం, స్వభూపాల వాహనసేవ జరగనుంది. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం రేపు జరగదినుంది. ఈ గరుడ సేవను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానంగా.. శ్రీవారికి ఘనంగా నిర్వహించే గరుడ వాహనసేన రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11గంటల వరకు జరగనుంది. ఈ గరుడ వాహన సేవ కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గరుడసేవను తిలకించేందుకు లక్షలాది తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ భద్రతాధికారులతో కలిసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దానిలో భాగంగా.. నేటి అర్థరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలను నిషేధించటంతో పాటు, కొండ కింద అలిపిరి దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. మాడవీధుల గ్యాలరీ రెండు లక్షల మంది భక్తులు వాహనసేవను తిలకించేందుకు వీలు ఉందని చెప్పారు. క్యూలైన్ల నుంచి మాడవీధుల కూడలికి పెద్దసంఖ్యలో భక్తులు చేరుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే.. గరుడ సేవను తిలకించేందుకు మాడవీధుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈవో శ్యామలరావు.

శ్రీవారి గరుడ సేవకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు. ఐదు వేల మంది పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గరుడ సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. సీసీ కెమెరా నిఘాలో తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తామన్నారు. మరోవైపు.. తిరుమలలో ఎనిమిది వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉందని, మిగతా వాహనాలను తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు హోల్డింగ్స్ పాయింట్స్‌లో పార్కింగ్ చేసుకొని.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు రావాలని సూచించారు ఎస్పీ సుబ్బారాయుడు. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ కళాకారుల సాంస్కృతిక, ఆధ్యా్త్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.