పవన్ తో తగ్గేదే..లే – లోకేష్ కు ప్రమోషన్

www.mannamweb.com


ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం లో త్వరలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఒక్కరికే ఆ అవకాశం ఇచ్చారు. అయితే, సీఎం చంద్రబాబు పైన పార్టీ ముఖ్యులతో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తోంది. పవన్ తో లోకేష్ కు సమాన హోదా పైన ఒత్తిడి పెరుగుతోంది. మరి..చంద్రబాబు నిర్ణయం ఏంటి. ఏం జరగనుంది.

పవన్ తో సమానంగా లోకేష్ ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకు ప్రాధాన్యత కొనసాగుతోంది. అటు తెలంగాణ, కర్ణాటక, తాజాగా తమిళనాడులో డిప్యూటీ సీఎంలకు తగిన గుర్తింపు ఉంది. ప్రతీ నిర్ణయంలోనూ వారు కీలకంగా ఉంటున్నారు. పవన్ మాత్రం లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. తన శాఖలకే పరిమితం అవుతున్నారు. చంద్రబాబు మాత్రం అవసరమైన ప్రతీ సందర్భంలో పవన్ కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కు కేటాయించిన డిప్యూటీ సీఎం హోదా మరెవరికీ ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో సీఎం కు అటు, ఇటు పవన్ – లోకేష్ ఆశీనులవుతున్నారు. దీని ద్వారా పదవి లేకపోయినా పవన్ -లోకేష్ ఇద్దరూ సమానమనే సంకేతాలు ఇస్తున్నారు.

చంద్రబాబుపై ఒత్తిడి ఇక, ఇప్పుడు నందమూరి -నారా కుటుంబంతో పాటుగా చంద్రబాబు సన్నిహిత నేతల నంచి ఒక కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. తమిళనాడు స్టాలిన్ పార్టీ, ప్రభుత్వం భవిష్యత్ నేతగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిని చేసారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే విధంగా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ప్రభుత్వం – టీడీపీలో లోకేష్ నిర్ణయాలే దాదాపుగా అమలు అవుతున్నాయనే ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం లోకేష్ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని..పవన్ అంతా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదనే చర్చ ఉంది. ఈ సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

పార్టీ -ప్రభుత్వంలో ప్రమోషన్ ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మిత్రపక్షాలుగా బీజేపీ, జనసేన ఉన్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా..మెజార్టీ పరంగా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో తన వారసుడిగా లోకేష్ కు పార్టీ..ప్రభుత్వం లో మరింత పట్టు పెరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో, కొంత కాలం తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ కు ప్రమోషన్ ఇచ్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో బంధం కొనసాగిస్తూనే..లోకేష్ కు ప్రాధాన్యత తగ్గకుండా ఆయనతో సమానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.