చంద్రబాబు మార్క్ నిర్ణయం.. అభివృద్ధిలో గేమ్‌ ఛేంజర్‌గా ఆరు పాలసీలు

www.mannamweb.com


వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా.. ఆరు పాలసీలు తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. సరికొత్త విధానాలు రాష్ట్ర అభివృద్దిలో గేమ్‌ ఛేంజర్‌గా మారుతాయన్నారు.

ఏపీ ఎంఎస్‌ఎమ్‌ఈ ఎంటర్‌వ్యూనర్ డెవలప్‌మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రీయల్ పార్క్‌, ఇంటిగ్రేటెడ్‌, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కొత్త పాలసీలపై చాలా కసరత్తు జరిగిందని..వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదంతో ముందుకెళ్తామన్నారు. త్వరలో ఐటీ, టూరిజం పాలసీలను కూడా తీసుకొస్తామన్నారు చంద్రబాబు

జాబ్‌ ఫస్ట్ పేరుతో పాలసీల రూపకల్పన

జాబ్ ఫస్ట్ పేరుతో అన్ని పాలసీలను రూపొందించామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతీ పాలసీలో ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. జీరో బడ్జెట్‌, నేచురల్ ఫార్మింగ్‌కు ఏపీ చిరునామా అన్నారు. నవంబర్ ఫస్ట్ వీక్‌లో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ రిలీజ్ చేస్తామన్నారు చంద్రబాబు. స్వర్ణాంద్ర 2017లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌

నీతిగా నిజాయితీగా వ్యాపారం ఎలా చేయాలనే దానికి రతన్ టాటా నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు. అందుకే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, అనంతపురం జోన్లలో ఐదు ఇన్నోవేషన్ రతన్ టాటా హబ్‌లు వస్తాయన్నారు. ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్‌ వచ్చేలా మన ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. గ్రీన్ ఎనర్జీ, నదుల అనుసంధానం, పోర్టులను కూడా అనుసంధానం చేస్తామన్నారు చంద్రబాబు. 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు.. 30లక్షల కోట్ల పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే సమయంలో ఉత్పత్తి వ్యయం తగ్గేలా చర్యలుంటాయన్నారు.