ఏపీలో స్కూల్స్‌కు గుడ్ న్యూస్.. స్టూడెంట్స్‌కు పండగే.

www.mannamweb.com


విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో పాఠశాలల నిర్వహణకు వందకోట్లకు పైగా విడుదల అయ్యాయి. దీంతో పాఠశాలల నిర్వహణ నిధుల కోసం వ్యయప్రయాసలు భరించే ప్రధానోపాధ్యాయులకు ఉపశమనం లభించనుంది.

కోవిడ్ తర్వాత పాఠశాలలకు సంబంధించిన కాంపోజిట్ గ్రాంట్లను, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణ నిధుల కొరత నెలకుంది. నిధులలేమితో పాఠశాలలు సమస్యల వలయాలుగా మారిన దుస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని గుర్తించిన విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.

విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో 2024-25 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 855 పీఎం శ్రీ పాఠశాలలకు వార్షిక గ్రాంట్ల వినియోగం కింద మొత్తం రూ. 8.63 కోట్లు, కేజీబీవీల్లో డైట్-మెయింటెనెన్స్ ఖర్చులకు రూ. 35.16 కోట్లు, మండల రిసోర్సు కేంద్రాలకు రూ. 8.82 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పాఠశాలలు, కేజీబీవీలు, మిగిలిన 40728 ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలలకు కూడా రూ.51.90 కోట్లు స్కూల్ కాంపోజిట్ నిధులు ఇచ్చారు. ప్రతి పాఠశాలకు 50 శాతం చొప్పున కాంపోజిట్ గ్రాంట్లు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నిధులు ఆయా పాఠశాలల నిర్వహణకు, నిరంతర అభివృద్ధికి, పాఠశాల పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలకు, విద్యుత్ చార్జీల చెల్లింపులు, సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, పాఠశాల విద్యా సామగ్రి (TLM), రిజిస్టర్లు, రికార్డులు తదితర స్టేషనరీ కొనుగోలు చేయడానికి వెచ్చించేందుకు కేటాయించారు. పాడైపోయిన పాఠశాల సామగ్రి, వినియోగపడని క్రీడా సామగ్రి బాగు చేయడానికి నిధులు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్, నీరు, ఉపకరణాలు కోసం నిధులు ఖర్చు చేయొచ్చు. విద్యా సంబంధిత దినోత్సవాలు, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సమస్యలు గుర్తించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో చర్చించిన తరువాత అత్యవసరంగా నిధులివ్వాల్సిన అవసరం ఉందని గుర్తించి భారీగా నిధులు విడుదల చేశారు.