కలిసుంటే కలదు సుఖం… కూటమిగా ఉంటేనే బలం… ఐకమత్యంతో వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఇవే డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు.
అటు కాషాయ పార్టీ నేతలు కూడా ఫ్రెండ్‌షిప్పే తియ్యని పుష్పం అన్న పాట పాడుతున్నారు. మరీ మిత్రబంధం బలంగానే ఉంటుందా..? 2029 ఎన్నికలకూ కలిసే వెళ్తారా…? అధినేతల సంగతి అట్లుంచితే.. ఇన్నర్‌గా కూటమి ఎలా ఉందన్నదీ చర్చ మొదలైంది.
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. 164 స్థానాలతో ప్రభంజనం క్రియేట్ చేసింది. కూటమిలో టీడీపీ ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. వందశాతం స్ట్రైక్ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన కంటిన్యూ అవుతోంది. పది స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కూడా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఇంతటి విజయానికి కారణం కూటమిగా ఏర్పడటం. యస్.. మూడు పార్టీలు జతకట్టినప్పటి నుంచి జనాల్లోకి బలంగా వెళ్లారు. సీట్ల సర్దుబాట్ల దగ్గర నుంచి.. అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత ప్రచారంలోనూ పక్కా ప్లానింగ్‌తో పనిచేశారు. పదవుల పంపకంలోనూ కలిసే నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా జతకట్టిన దగ్గర్నుంచి… ఇవాళ్టి వరకు మాంచి ఫ్రెండ్‌షిప్ మెయిన్‌టేన్ చేస్తున్నారు.
ఇక కలిసి కట్టుగా గెలిచారు.. కూటమిగా ఎన్నాళ్లుంటారు..? మిత్రబంధం ఎప్పటిదాకా..? అన్న ప్రశ్నలకు తావివ్వకుండా మూడు పార్టీల అధినేతలు పదేపదే ఫ్రెండ్ షిప్ సాంగ్స్ పాడుతున్నారు. కలిసే ఉంటాం.. కలుపుకునే వెళ్తామంటున్నారు. ఇక లేటెస్ట్‌గా కూటమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికలకూ కూటమిగానే వెళ్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా మిత్రపక్షాలతో గిల్లికజ్జాలకు దిగొద్దని టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు డైలాగులనే పదేపదే రిపీట్ చేస్తున్నారు. కూటమిగానే ఉంటామంటున్నారు. ఉండాలని కూడా జనసేన నేతలకు చెబుతున్నారు. కూటమి నేతలతో మీటింగ్ అయినా.. సొంతపార్టీ నేతలతో సమావేశమైనా స్నేహంగానే ముందుకెళ్తామంటున్నారు పవన్ కళ్యాణ్.
ఇక రాజమండ్రిలో జరిగిన మీటింగ్‌లో బీజేపీ సైతం ఇదే మాట చెబుతోంది. కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. జనసేన, టీడీపీ నేతలతో కలిసిమెలిసి ఉండాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక మొన్న హర్యానాలో జరిగిన ఎన్డీయే మీటింగ్‌లోనూ ఆల్ పార్టీస్ ఇదే క్లారిటీకొచ్చాయి. 2029 ఎన్నికల కోసం పార్టీలన్నీ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కూటమిగానే వెళ్తామంటున్నారు నేతలు. నెక్ట్స్ ఎలక్షన్‌పై టెన్షన్ వద్దు… కలిసే ముందుకు అన్న సంకేతాలిస్తున్నారు.