ఏపీలో మరో రెండు పథకాల అమలుకు మహూర్తం ఫిక్స్.. ఒక్కో విద్యార్థికి . 15వేలు, ఒక్కో రైతుకు రూ.20వేలు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టింది. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయాలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది.

తల్లికి వందనం పథకాన్ని మరో మూడు నెలల్లో అమలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే రైతులకు సంబంధించిన ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే మార్చి, ఏప్రిల్‌లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి తల్లికి వందనంపై హామీ ఇచ్చింది. చదువుకునే పిల్లలందరికీ.. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వీరందరికీ తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు దాదాపు రూ.12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం ఆలస్యం కావడానికి కారణాలు ఉన్నాయట.. ఈ పథకానికి సంబంధించి పక్కాగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారట. అందుకే కొంత సమయం తీసుకున్నా అన్ని లోపాలను సరిచేసి అమలు చేయబోతున్నారట.

కూటమి ‘అన్నదాతా సుఖీభవ’ పథకం పేరుతో మరో హామీ కూడా ఇచ్చింది. రాష్ట్రంలో అన్నదాతలకు ఏడాదికి రూ.20వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రైతులకు సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నదాతా సుఖీభవ ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు పథకాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోందట.. పక్కాగా విధివిధానాలను రూపొందించాలని భావిస్తున్నారట. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా.. కొన్ని లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారట. అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా చూడాలని భావిస్తున్నారట. ఎలాంటి లోపాలు లేకుండా విధివిధానాలు రూపొందించి.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు పథకాలకు భారీగా నిధులు సమాకూర్చుకోవల్సి ఉంటుంది. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలకు నిధులు కూడా ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు శాఖలవారీగా పరిస్థితిని సమీక్షించడానికి సరిపోయింది.. ఆ తర్వాత కూడా సమీక్షలు.. శ్వేతపత్రాల విడుదల, ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టారు. సెప్టెంబర్ నెలలో వర్షాలతో వరదలు, సహాయ, పునరావాస చర్యలకే నెల గడిచిపోయింది. అందుకే పథకాల అమలు ఆలస్యమైందంటున్నారు.