సేఫ్టీలో టాటా కార్లు ఇందుకే తోపు- టాటా కర్వ్​తో మళ్లీ రుజువైంది..

www.mannamweb.com


సేఫ్టీకి పెట్టింది పేరు టాటా మోటార్స్​! తాజాగా విడుదలైన టాటా కర్వ్​, టాటా కర్వ్​ ఈవీలతో ఇది మరోమారు రుజువైంది. భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ వెహికిల్స్​కి టాప్​ రేటింగ్స్​ లభించాయి. ఇందుకు గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాము..

భారత ఆటోమొబైల్​లో ‘సేఫ్టీ’ టాపిక్​ రాగానే అందరికి గుర్తొచ్చే పేరు టాటా మోటార్స్​! కస్టమర్ల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కీలక సేఫ్టీ ఫీచర్స్​ని తన వాహానాల్లో ఇస్తుంది ఈ సంస్థ. ఇక ఇప్పుడు టాటా కర్వ్​, టాట కర్వ్​ ఈవీలతో ఈ విషయం మరోసారి రుజువైంది. భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ రెండు వెహికిల్స్​కి కూడా టాప్​ రేటింగ్స్​ లభించాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​లోని సేఫ్టీ ఫీచర్స్​ గురించి, క్రాష్​ టెస్ట్​ గురించి సవివరంగా తెలుసుకుందాము..

రెండు వేరువేరు ప్లాట్​ఫామ్స్​- కానీ బెస్ట్​ ఔట్​పుట్​!

టాటా కర్వ్​, టాటా కర్వ్ ఈవీలు చూడటానికి దాదాపు ఒకేలా ఉండవచ్చు. కానీ కూపే ఎస్​యూవీలు పూర్తిగా భిన్నమైన ప్లాట్​ఫామ్స్​పై తయారయ్యాయి. టాటా కర్వ్ ఈవీ కంపెనీ అడ్వాన్స్​డ్​ కనెక్టెడ్ టెక్-ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ (యాక్టి.ఈవీ) ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్​ఫామ్​ని పంచ్ ఈవీతో పరిచయం చేసింది టాటా మోటార్స్​. ఈ ప్లాట్​ఫామ్​ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించడం జరిగింది. మెరుగైన కనెక్టివిటీ, భద్రతను నిర్ధారించేటప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుగుణంగా అధునాతన ఫీచర్లకు ఇది అనుమతిస్తుంది.

మరోవైపు టాటా కర్వ్​ కూపే ఎస్​యూవీ అట్లాస్ (అడాప్టివ్ టెక్ ఫార్వర్డ్ లైఫ్​స్టైల్ ఆర్కిటెక్చర్) అనే కొత్త ప్లాట్​ఫామ్​ మీద నిర్మించింది సంస్థ. టాటా ప్రకారం.. అట్లాస్ కఠినమైన బల్క్ హెడ్ నిర్మాణాలు, సస్పెన్షన్- ఇంజిన్ భాగాల కోసం బలమైన మౌంటింగ్ పాయింట్లతో మంచి ఫ్రేమ్​వర్క్​ని కలిగి ఉంది. ఇది క్రాష్ అయినప్పుడు వాహన పనితీరును మెరుగుపరచడానికి ఉద్దేశించ రూపొందించింది.

ఇక ఇప్పుడు ఈ రెండు వెహికిల్స్​లోని సేఫ్టీ ఫీచర్స్​పై ఓ లుక్కేద్దాము..
టాటా కర్వ్, కర్వ్ ఈవీ: సేఫ్టీ ఫీచర్స్..

టాటా కర్వ్, కర్వ్ ఈవీ భద్రతా ఫీచర్ల లిస్ట్​ ఎక్కువగానే ఉంది. టాటా కర్వ్​లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టీపీఎంఎస్​తో పాటు ఆరు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్​గా ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్, అన్ని డిస్క్ బ్రేక్లు, ఆటో హోల్డ్​తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

ఇక టాటా కర్వ్ ఈవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ ఫంక్షన్​తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అండ్ డిసెంట్ అసిస్ట్, ఈఎస్​పీ, డ్రైవర్ స్లీప్ అలర్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా కర్వ్ ఈవీ ఏవీఏఎస్ (అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్) వస్తోంది. దీంతో టాటా కర్వ్ ఈవీ గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు సౌండ్ అలర్ట్స్​ను జనరేట్​ చేస్తుంది.
టాటా కర్వ్, కర్వ్ ఈవీ: క్రాష్ టెస్ట్ రేటింగ్..

ఇటీవల భారత్​ ఎన్​సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్​లో అడల్ట్ ప్రొటెక్షన్ లో 32కు 29.5, చైల్డ్ ప్రొటెక్షన్ లో 49కి 43.66 మార్కులు సాధించింది టాటా కర్వ్​. కాగా, టాటాకర్వ్ ఈవీ వయోజన రక్షణలో 32కు 30.81 పాయింట్లు, పిల్లల రక్షణలో 49 పాయింట్లకు 44.83 పాయింట్లు సాధించింది.

టాటా కర్వ్ ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 14.65, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 14.85 స్కోరు సాధించాడు. మరోవైపు టాటా కర్వ్ ఈవీ ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 15.66, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 15.15 పొందింది.

చైల్డ్ ప్రొటెక్షన్ క్రాష్ టెస్ట్​లో వెహికల్ అసెస్​మెంట్ స్కోర్​లో టాటా కర్వ్ 13కు 9 పాయింట్లు సాధించినట్లు వెల్లడైంది. డైనమిక్ స్కోర్​లో 24కు 22.66, సీఆర్​ఎస్​ ఇన్​స్టలేషన్ స్కోర్​లో 12కు 12 మార్కులు వచ్చాయి. చైల్డ్ ప్రొటెక్షన్ పరంగా కర్వ్ ఈవీ డైనమిక్ స్కోర్ లో 24కు 23.88, సీఆర్ఎస్​ ఇన్​స్టలేషన్ స్కోర్ లో 12కు 12 మార్కులు సాధించింది. వెహికల్ అసెస్మెంట్ స్కోర్​లో 13కు 9 మార్కులు సాధించింది.

ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి 11 కంపెనీలను కలిగి ఉన్న కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్​కు టాటా కర్వ్​తో టాటా మోటార్స్​ గట్టి పోటినిస్తోంది.