చైనాను వెనక్కు నెట్టిన భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్ మనదే!

www.mannamweb.com


భారత్‌లో ఆటోమెుబైల్ రంగం దశాబ్ద కాలంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ఇక టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానానికి వచ్చింది.

భారతదేశం ఇప్పుడు చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్‌గా ఉంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2024 ప్రథమార్థంలో ప్రపంచ ద్విచక్ర వాహనాల విక్రయాలు సంవత్సరానికి 4 శాతం పెరిగాయి. గ్లోబల్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో హోండా అగ్రగామిగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో హీరో మోటోకార్ప్, యమహా, టీవీఎస్ మోటార్, యాడియా ఉన్నాయి. ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో అమ్మకాలు క్షీణించగా.. భారత మార్కెట్ బలం భిన్నంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కఠినమైన రుణ నిబంధనలు ఆ దేశాల్లో క్షీణతకు కారణం అయినట్టుగా తెలుస్తోంది.

ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రపంచంలోని టాప్ 10 ద్విచక్ర వాహన తయారీదారులు మొత్తం అమ్మకాలలో 75 శాతం కంటే ఎక్కువ వాటా అందించారు. ఈ బ్రాండ్లలో టీవీఎస్ మోటార్ సంవత్సరానికి 25 శాతం గణనీయమైన వృద్ధితో నిలుస్తుంది.

ఈ ఏడాది ప్రథమార్థంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్ 22 శాతం వృద్ధి చెందిందని సీనియర్ విశ్లేషకుడు సోమ్నే మండల్ తెలిపారు. ఈ అసాధారణ వృద్ధి చైనాను అధిగమించి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా మార్చింది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

చైనాలో సంప్రదాయ మోటార్‌సైకిళ్లు, ప్రయాణానికి స్కూటర్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. 125సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల సౌలభ్యం, పర్యావరణ ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

భారతీయ మార్కెట్ మాత్రం టూ వీలర్స్ అమ్మకాల్లో ముందుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారతదేశంలోనే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికాలో కూడా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వినియోగదారులు ఖర్చు తగ్గించుకోవాలని ఆలోచనతో ఆగ్నేయాసియా ద్విచక్ర వాహన విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. దీనితోపాటుగా కఠినమైన క్రెడిట్ నిబంధనలు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు వివిధ సమస్యలను కలిగిస్తున్నాయి.

అగ్రగామి టూ వీలర్ మార్కెట్‌గా భారతదేశం సాధించిన విజయం ఈ రంగంలో నిరంతరం కొనసాగేలా కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న గ్రామీణ డిమాండ్‌తో భారతదేశం ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించనుంది.

మెుత్తంగా చూసుకుంటే.. భారతదేశం మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల విక్రయాలలో మొదటి స్థానంలోకి వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహనం నిత్యావసర వస్తువుగా మారింది.