టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ రెండు కేసులపై సుప్రీంకోర్టులో జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ రెండు కేసుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా పలువురి పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా.. తాము కౌంటర్‌కు రిజాయిండర్ దాఖలు చేస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబర్ 17కి వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు తెలిపింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, జోగి రమేష్, ఇతర నేతలు విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణకు సహకరించడం లేదంటోంది. అయితే దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. పాస్ పోర్టులను కూడా అప్పగించేశామని అవినాష్, జోగి రమేష్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. మరి వైఎస్సార్‌సీపీ నేతలు రిజాయిండర్‌లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది చూడాలి. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.
ఈ రెండు కేసుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ జరగ్గా.. ఈ కేసులో నిందితులు విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు.. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు విచారణ సరిగా స్పందించడంలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య గతవారం కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. చైతన్య ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెబుతున్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో దాడికి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తేలింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించిన తర్వాత హటాత్తుగా మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. చైతన్యకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో మిగిలిన వైఎస్సార్‌సీపీ నేతలు విచారణకు హాజరవుతున్నారు. ఈ రెండు కేసుల్ని ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ విధించగా జైల్లో ఉన్నారు.. మధ్యలో పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఆ వెంటనే వెలగడపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటగా కోర్టు రిమాండ్ విధించగా.. ఆ గడువు ముగిడయంతో మరోసారి కోర్టులో హాజరుపరిచ్చారు. జడ్జి మరో 14 రోజుల పాటూ రిమాండ్ విధించారు. అనంతరం మాజీ ఎంపీ సురేష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.