ప్రకృతి ఒడిలో కొలువైన రంగనాథ స్వామి ఆలయం.. ట్రెక్కింగ్ ప్రియులకు ఓ అద్భుత ప్రదేశం

www.mannamweb.com


ప్రకృతి అందాలు.. చుట్టూ ప్రవహించే హేమావతి నది.. హాసన్ జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయం ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఈ ఆలయం కొండ రాళ్లతో కప్పబడి ఉంటుంది.

ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు మనసును హత్తుకుంటాయి.

హోలెనరసీపూర్ తాలూకాలోని హలేకోటే గ్రామంలో ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. హేమావతి డ్యామ్ వెనుక ఒక రహదారి ఉంది. ఈ రహదారి ద్వారా రంగనాథ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. ఇది ఒక ద్వీపంలా కనిపించడం సహజం. ఇక్కడికి వెళ్ళిన వారు ప్రకృతి అందాలను చూసి మైమరచి పోతారు.

దేవుని దర్శనం కోరుకునే వారికి, ట్రెక్కింగ్ ప్రియులకు కూడా ఇది అద్భుతమైన ప్రదేశం. అంతే కాకుండా మరో ప్రత్యేకత ఏమిటంటే కొండమీద రాళ్లు. కొండపై ఉన్న భారీ రాళ్లు ఎలాంటి ఆసరా లేకుండా నిలబడి ఉండడం ఒక్కక్షణం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కొండ శిఖరంపై ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకోవాలనుకునే వారు హాసన్‌లోని హోలేనరసీపూర్ తాలూకాలోని హళేకోట్‌ను సందర్శించవచ్చు. కొండ రంగనాథ అని కూడా పిలువబడే మావినకెరె రంగనాథ స్వామి ఇక్కడ ప్రకృతి రమణీయత మధ్య కొలువై ఉన్నాడు.

ఇది ఒక గుహ దేవాలయం. రంగనాథ స్వామి గర్భగుడి శిలల మధ్య ఉంది. నక్షత్రం ఆకారంలో ఉన్న వాస్తు శైలిని ఇక్కడ చూడవచ్చు. గర్భగుడిలోని రంగనాథ రాయి వెనుక మూడు అడుగుల ఎత్తున్న స్వామి విగ్రహం ఉంది. చుట్టూ ప్రవహించే హేమావతి నది మధ్య.. కొండపై నుండి నిలబడి అందమైన ప్రకృతి అందాల దృశ్యాలను చూడవచ్చు.