ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అక్టోబరు 21 నుంచి నవంబరు 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు.

రూ.100 ఆలస్య రుసుముతో నవంబరు 12 నుంచి 20 వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. మొదటి లేదా రెండో ఏడాది చదివే విద్యార్ధులు జనరల్‌ థియరీ సబ్జెక్టులకు రూ. 600, సెకండ్‌ ఇయర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ. 275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ. 165 చొప్పున ఫీజు చెల్లించాలని వెల్లడించారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి థియరీ పరీక్షలకు రూ. 1200 చెల్లించాలని ఆమె సూచించారు. హాజరు మినహాయింపు కోరేవారు ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని, వీరు నవంబరు 15వ తేదీలోపు రూ. 1500 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

‘ఏపీ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ త్వరలో పునఃప్రారంభిస్తాం’ డీజీపీ ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 6 వేలకు పైగా కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ గత కొంతకాలంగా నిలిచిపోయింది. దీనిపై న్యాయసలహా తీసుకుని త్వరలోనే ఈ ప్రక్రియను పునఃప్రారంభిస్తాం. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య, తుది రాతపరీక్షల నిర్వహణకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను మొత్తం 180 రోజుల్లోగా పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవి కాకుండా మిగతా ఖాళీల భర్తీకి కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అక్టోబర్‌ 23 నుంచి డీఈఈసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో డీఎడ్‌ కోర్సుల్లో చేరేందుకు అక్టోబర్‌ 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని డీఈఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 30న వీరికి సీట్లు కేటాయిస్తామన్నారు. అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ సమర్పించని 7 ప్రైవేట్‌ డీఈడీ కాలేజీలకు ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ఈ విద్యాసంవత్సరం అనుమతి నిరాకరించినట్లు ఆయన తెలిపారు.