విలాసవంతమైన భవనాలను ఏం చేస్తారు? రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

www.mannamweb.com


రుషికొండలోని భవనాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో అత్యంత విలాసవంతంగా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని అతిథి గృహాల కోసం కట్టామని వైసీపీ చెబుతోంది. మరోవైపు జగన్ కోసమే విలాసవంతమైన నిర్మాణాలు కట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.

మరి ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటారా? ప్రైవేట్ కు ఇస్తారా? అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆదాయం కంటే నిర్వహణ భారం ఎక్కువగా మారింది. రుషికొండపై 9.88 ఎకరాల్లో ఏడు భవనాలు నిర్మించారు. రుషికొండ భవనాలకు భారీగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి. 5 నెలల్లో ప్రతి నెల సగటున రూ.6 లక్షలకు పైగానే బిల్లు వస్తోంది. ప్రతి నెల 40వేల నుంచి 60వేల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది.

గతంలో వైసీపీ ప్రభుత్వంలో రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలిచేందుకు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అదే ప్రాంతంలో పర్యటించారు. రుషికొండ భవనాలను ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న కార్మికులతో పవన్ ముచ్చటించారు. ఏ సమయంలో వారు వస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.

పవన్ కల్యాణ్ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్లలేదు. బయటి నుంచే భవనాలను పరిశీలించారు. మొత్తం ఏడు బ్లాక్ లను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు.

రుషికొండ భవనాలను ఏం చేస్తారు? అనేదానిపై ఒక ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో రూ.500 కోట్లతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాలను ఏం చేస్తారు? అనేది అటు ప్రజల్లోనూ ఇటు అధికారులు, మంత్రుల్లోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. వీటిని డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అలాగే హోటల్ చేయాలని, సినీ పరిశ్రమకు ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అదే సమయంలో ఐటీ పరిశ్రమకు కేటాయించాలనే ప్రతిపాదన కూడా వినిపించింది. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాల లోపలికి వెళ్లి పరిశీలించారు. దాంతో లోపల ఏం జరిగింది? అనేది అందరికీ తెలిసింది. అత్యాధునిక హంగులతో, భారీ ఖర్చుతో, విలాసవంతమైన భవనాలను నిర్మించినట్లు బయటకు తెలిసింది. ఇంత ఖరీదైన భవనాలను ఏం చేస్తారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది అప్పటి నుంచి ఉత్కంఠగా మారింది. ఈ పరిస్థితుల్లో రుషికొండ ప్యాలెస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించడంతో.. త్వరలోనే దీనిపై కూటమి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది.