ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ జులై-2024) పరీక్షలు అక్టోబర్ 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుంది.
అయితే టెట్ స్కూల్ అసిస్టెంట్ (2ఏ) ఇంగ్లిష్ సబ్జెక్టులో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు. ఈ పేపర్ రెండో సెక్షన్‌లో మాతృ భాషగా తెలుగు సబ్జెక్టు రాయాల్సి ఉండగా, చాలామందికి ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ రావడం వివాదంగా మారింది. నిజానికి, ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఎస్‌ఏ వారికి దరఖాస్తు సమయంలోనే మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఎస్‌ఏ ఇంగ్లిష్ సబ్జెక్టుకు టెట్‌లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. చైల్డ్ డెవలప్‌మెంట్ పెడగాజీ, మాతృభాష, జనరల్ ఆంగ్లం, సబ్జెక్టు కంటెంట్-మెథడాలజీ ఉంటాయి. రెండో సెక్షన్‌లో సాధారణంగా మాతృభాషగా తెలుగు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కానీ చాలా మంది మళ్లీ ఆ విభాగంలో తెలుగుకు బదులుగా మళ్లీ ఇంగ్లిష్‌నే ఎంపిక చేసుకున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన టెట్ ప్రకారం మాతృభాషను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా కొందరు అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. కొందరు తెలుగు ఎంపిక చేసుకోవడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్లం ఎంపిక చేసుకోవడంతో మార్కుల్లో వ్యత్యాసం వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్ రాసే వారిలో తమిళ్, కన్నడ, ఒడియావారు కూడా ఉన్నారు. దీంతో మాతృభాషగా అన్ని సబ్జెక్టులూ వచ్చేలా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసే సమయంలో రెండో సెక్షన్ మాతృభాషకు సంబంధించి ఎవరికి వారు ఆయా భాషలను ఎంపిక చేసుకోవాలి. తెలుగు రాయాల్సిన వారు తెలుగుకు బదులు మళ్లీ ఆంగ్లాన్నే ఎంచుకోవడంతో సమస్య తలెత్తింది. నిజానికి, టెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుప్పటికీ ఆంగ్ల సబ్జెక్టే వచ్చింది. దీనిపై అప్పట్లో అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా ఇలా జరిగిందనీ, పరీక్ష సమయంలో మార్పు చేస్తామని పేర్కొన్నారు. కానీ, తాజాగా జరిగిన ఆన్‌లైన్ పరీక్షలో మాత్రం అభ్యర్థుల మాతృభాషగా తెలుగుకు బదులు ఇంగ్లిష్ ఓపెన్ అయ్యింది. దీంతో అభ్యర్థులు తెలుగు పరీక్ష రాయలేదు.
టెట్ నిబంధనల ప్రకారం నాలుగు విభాగాలకు కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి. సబ్జెక్టు కంటెంట్-పెడగాజీకి 90మార్కులు మిగతా మూడు సెక్షన్లకు 30 మార్కుల చొప్పున ఉంటాయి. ఇప్పుడు మాతృభాష సబ్జెక్టు ఎంపికలో జరిగిన మార్పు కారణంగా 30 మార్కుల్లో తేడాలు వస్తే తమకు ర్యాంకులు మారిపోతాయని అభ్యర్థులు వాపోతున్నారు.