తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వెళ్లిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని ఏపీ టూరిజం ఎండీగా ప్రభుత్వం నియమించింది. అలాగే ఏపీ టూరిజం అథారిటీ CEOగాను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేశారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి.. సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏపీకి వెళ్లాలని.. ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది డీవోపీటీ. అయితే DOPT ఉత్తర్వులపై స్టే కోరుతూ ఏపీ కేడర్ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్‌ల పరిపాలనా వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకుంటే.. ముగింపు ఉండదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఏపీలో రిపోర్ట్ చేయగా.. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.