లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు. సెక్యూరిటీ కోసం ఆరు వేల మందికి పైగా పోలీసులు. 10 నుంచి 20 కిలోమీటర్ల మేర నడిచి వచ్చిన కార్యకర్తలు. 10 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాల లైన్లు.
సభ జరగడానికి రెండ్రోజుల ముందే వేదిక వద్దకు కుటుంబాలతో వచ్చి.. వంటలు వండుకుని.. అక్కడే బస చేసిన కొందరు అభిమానులు. 18 మెడికిల్ టీమ్స్, 22 అంబులెన్స్ లు.
ఇవన్నీ తమిళ హీరో విజయ్ ఏర్పాటుచేసిన పార్టీ మహానాడు సభ సాక్షిగా జరిగిన ముచ్చట్లు. మాస్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్.. పార్టీ పెడుతున్నాడు అన్న వెంటనే ఒక్కసారిగా తమిళనాడు అంతటా ఆయన పేరు మార్మోగిపోయింది. ఇళయదళపతి అంటే వారికి అంత ఇష్టం, అభిమానం.
గత పదేళ్లుగా పాలిటిక్స్ లోకి వస్తున్నా వస్తున్నా అంటూ హింట్ ఇస్తున్న విజయ్.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న అఫీషియల్ గా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న చెన్నైలోని టీవీకే హెడ్ ఆఫీసులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అప్పుడు పార్టీ గీతాన్ని కూడా పాడారు. తరువాత ఎన్నికల కమిషన్ కూడా టీవీకే పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ తొలి మహానాడును లక్షలాదిమందితో విజయవంతంగా నిర్వహించడం, పార్టీ సిద్ధాంతాలు ఏమిటో.. భవిష్యత్ ప్రణాళిక ఏమిటో క్లియర్ కట్ గా చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి.