ఉద్యోగాలు చేస్తున్న వారికి వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ రావడం తెలిసిన విషయమే. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రావడం వల్ల ఆర్థిక భరోసా ఉంటుంది. కానీ పెన్షన్ అనేది ఉద్యోగాలు చేయని వారికి రావు. అంతేగాక కొన్ని రంగాల్లో పని చేసే కార్మికులకు, తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ఎటువంటి పెన్షన్ సౌకర్యాలు ఉండవు. గవర్నమెంట్ నుంచి వచ్చే వృద్ధాప్య ఫించన్లు పెద్దగా సరిపోవు. అందువలన వారు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే .. కచ్చితంగా పరిష్కారం ఉంది. మరి ఉద్యోగం లేకపోయినా పెన్షన్ ఎలా పొందవచ్చు ?దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చిన్న చిన్న రంగాల్లో పని చేసే కార్మికులకు, కూలి పని చేసుకునే వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం పేరే అటల్ పెన్షన్ యోజన. దీనిలో చేరిన వారికి గరిష్ఠంగా నెలకు రూ.5 వేల దాకా పెన్షన్ వస్తుంది. ఇక ఈ అటల్ పెన్షన్ యోజన లో ఎలా చేరాలి? దీనికి అర్హతలేంటి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన పథకంల 18- 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా కూడా చేరొచ్చు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయని వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా సుఖంగా బతికేందుకు ఈ పథకం మీకు ఆదాయాన్ని అందిస్తుంది. దీనిలో మనం నెలకు కట్టుకునే డబ్బు ఆధారంగా, 60 ఏళ్ల తర్వాత రూ. 1,000 – రూ. 5,000 దాకా నెలకు గ్యారెంటెడ్ పెన్షన్ పొందవచ్చు. జీవితాంతం నెలవారీ పెన్షన్‌ను పొందవచ్చు. ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే అతడి భార్యకు పెన్షన్ అందుతుంది. ఆమె కూడా మరణిస్తే నామినీకి కార్పస్ ఫండ్ వస్తుంది. పైగా ఈ స్కీమ్ లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు చాలా తక్కువ అమౌంట్ కట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరాక మీరు నెలకు సరిగ్గా డబ్బు కట్టకపోతే జరిమానా పడుతుంది. 24 నెలల పాటు కంట్రిబ్యూషన్ చెల్లించకపోతే, మీ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. ఈ స్కీమ్‌లో చేరాలంటే పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అక్కడ ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక అటల్ పెన్షల్ యోజన ఫారమ్‌ను బ్యాంక్ వెబ్ సైట్ల నుంచి ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరవచ్చు. లేదా బ్యాంక్ బ్రాంచ్ లోనైనా ఈ ఫారమ్ ని ఫిల్ చేయవచ్చు. మీ ఆధార్ నంబర్, కాంటాక్ట్ వివరాలు, నామినీ వివరాలను అటల్ పెన్షల్ యోజన ఫారమ్ లో నింపాలి. మీరు ఈ స్కీమ్ లో ఎంత డబ్బు కట్టాలనుకుంటున్నారో కూడా ఫిల్ చేయాలి.ఆ తర్వాత ఈ స్కీమ్‌కు మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అవుతాయి.