ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36 వేల 559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లను, 3 వేల 414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని నియమించింది ప్రభుత్వం.
సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటనే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలి. తర్వాత కులగణనకు ఇంటింటికి వెళ్లాలి.
ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదన్నారాయన. సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామన్నారు. కరీంనగర్‌లో ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది.
బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయినా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ సర్కార్‌కు లేదు కాబట్టే నామ్‌కేవాస్త్ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు కుల సంఘాలు కూడా కులగణన, బీసీ కమిషన్‌పై పెదవి విరుస్తున్నాయి. లెక్కలు పక్కాగా రాకపోతే ఊరుకునేది లేదంటున్నాయి. మరోవైపు విపక్షాలు, కులసంఘాల ఆరోపణలను విమర్శలను పట్టించుకోకుండా కులగణనకు అన్నిఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించాలని నిర్ణయించింది. ఈనెల 30లోగా సర్వే పూర్తిచేయాలని డెడ్ లైన్ విధించింది.