మహిళలకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. వారందరికీ రూ.8 లక్షలు

www.mannamweb.com


మహిళలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త అందించింది. కొత్తగా నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించనుంది. వ్యవసాయ రంగంలో పురుగుమందులను పిచికారీ చేసేందుకు మహిళా సంఘాలకు చేయూతను అందించనుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కో మహిళా స్వయం సహాయక బృందానికి గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

2024-25 నుంచి 2025-26వ ఆర్థిక సంవత్సరం వరకు ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.1261 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘానికి ఆర్థికంగా సహాయం చేయనుంది. అయితే డ్రోన్‌ ధరలో గరిష్ఠంగా 80 శాతం గానీ.. లేదంటే రూ.8 లక్షలు కానీ ఆర్థిక సాయంగా అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీ రాయితీతో స్వయం సహాయక సంఘాల క్లస్టర్‌ స్థాయి సమాఖ్యలు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

ఈ పథకం ప్రధాన ఉద్దేశం.. మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించి వారి కాళ్లపై వారు ఆధారపడేలా చేయడమే కాకుండా వ్యవసాయ రంగంలో అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ ఏడాది డ్రోన్లు అందించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహిళా సంఘాలకు అధికంగా ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు డ్రోన్ల పంపిణీ చేయనున్నారు.

ఇక రాష్ట్రాలకు డ్రోన్లు పంపిణీ చేయడానికి ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులో గరిష్ట సాగు భూమి, చురుకైన మహిళా స్వయం సహాయక బృందాలు, నానో ఎరువుల వినియోగం ఆధారంగా డ్రోన్లను అందించనున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. డ్రోన్ ప్యాకేజీ ధర సుమారు రూ. 10 లక్షలు ఉండగా.. ఈ డ్రోన్ కోసం.. సహాయక బృందాలకు రూ. 8 లక్షలు అంటే 80 శాతం సబ్సిడీ అందించనున్నారు. మిగిలిన రూ. 2 లక్షలు అంటే 20 శాతం అప్పు ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది మహిళలు మహిళా స్వయం సహాయక బృందాల్లో చేరారు.

ఇందులో డ్రోన్‌తోపాటు నాలుగు ఎక్స్‌ట్రా బ్యాటరీలు, ఛార్జింగ్ హబ్, ఛార్జింగ్ కోసం జెన్‌సెట్, డ్రోన్ బాక్స్‌ ఉంటాయి. అంతేకాకుండా డ్రోన్‌ను కంట్రోల్ చేసేందుకు మహిళకు డ్రోన్ పైలట్‌ ట్రైనింగ్ కూడా ఇస్తారు. డ్రోన్ డేటా విశ్లేషణ, మెయింటెనెన్స్ కోసం మరో మహిళకు కో-పైలట్‌గా 15 రోజుల ట్రైనింగ్ ఇస్తారు.