మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మేఘాల కొండకు బ్రేక్ పడింది…
మేఘాల కొండ.. ఇది ఇప్పుడు ఫేమస్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ మేఘల కొండను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో మేఘాల కొండ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మేఘాల కొండకు అనుకోని కష్టం వచ్చింది. మేఘాల కొండపై అటవీ శాఖ కన్నుపడింది. ఇటీవల దేశవ్యాప్తంగా పర్యాటకపరంగా ఫేమస్ కావడంతో అరకులోయ మండలం మాడగడ మేఘాలకొండకు అటవీశాఖ బ్రేక్ వేసింది. మాడగడ ప్రాంతం తమ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉందని ఇతరులు ప్రవేశించరాదని అటవీశాఖ బోర్డు పెట్టేసింది.
మాడగడ కొండకు టూరిస్టుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని రూ.16 కోట్లతో డబల్ రోడ్డు నిర్మాణ పనులను ఇటీవలే పాడేరు ఐటీడీఏ మొదలుపెట్టింది, అయితే ఇంతలోనే అడవి శాఖ మాడగడ మేఘాల కొండ ప్రాంతం తనదంటూ బోర్డు పెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజు వందల వాహనాలు, వేల జనంతో కిటకిటలాడే మేఘాలకొండ ఈరోజు(శనివారం) ఉదయం వెలవెల పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ హఠాత్పరిణామంతో మేఘాల కొండను ఆధారం చేసుకుని బ్రతుకుతున్న మాడగడ గ్రామస్తులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. ఈ స్థలం రెవెన్యూ శాఖలోనే ఉందని సర్వేనెంబర్ 84, 85, 86 ప్రకారం తమకే చెందుతుందని రెవెన్యూ శాఖ వారు నిన్న (శుక్రవారం) సబ్ కలెక్టర్ హయాంలో సర్వే అనంతరం వెల్లడించారు. అటవీ శాఖ ఈ దుందుడుకు చర్యను మాడగడ గ్రామ సర్పంచ్ జ్యోతి తీవ్రంగా ఖండించారు.
మేఘాల కొండ అందాలు…
కాగా.. మేఘాల కొండ అందాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరచూ వస్తుంటారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. అరకులోయ మండలం లంతంపాడు సమీపంలో ఉన్న కొండపై నుంచి చూస్తే తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. వేకుజామునే ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటక ప్రేమికులు తరలివస్తుంటారు. ఇంతటి అందమైన దృశ్యాలకు అటవీ శాఖ బ్రేక్ వేయడంపై పర్యాటకులు కూడా ఆశ్చపోతున్నారు. ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేఘాల కొండను చూసేందుకు అనుమతించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు