ప్రస్తుతం మార్కెట్ ను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు శాసిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి విడుదల కానుంది.
హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ (హెచ్ఎంఎస్ఐ) 2011 లో యాక్టివా ను ఆవిష్కరించింది. దీనికి లభించిన ఆదరణతో స్కూటర్ మార్కెట్ ఊపందుకుంది. ఎందరో వినియోగదారులకు ఫేవరెట్ వాహనంగా మారింది. అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా ఇప్పడు ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేయనుంది.
ఎలక్ట్రిక్ విభాగంలోకి మిగిలిన కంపెనీలతో పోల్చితే హెచ్ఎంఎస్ఐ ఆలస్యంగా వస్తోంది. అయినా వినియోగదారులు ఈ బండి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కంపెనీ సీఈవో సుట్సుమి ఓటాని.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోబైల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇది ఏడాది పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2025 మార్చిలో ఈ వాహనం రోడ్లపై పరుగులు పెట్టనుంది. యాక్టివా ఎలక్ట్రిక్ గురించి ఆ కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బ్యాటరీ ప్యాక్ కు అనుగుణంగా రూపొందించిన కొత్త ప్లాట్ ఫాంను ఉపయోగించుకుంటుంది. ముఖ్యంగా మాస్ మార్కెట్ కస్టమర్లను ఆకట్టుకునేలా బండిని తీర్చిదిద్దారు. రిమూవబుల్ బ్యాటరీని బదులుగా స్థిరమైన దాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఎలక్ట్రిక్ బ్లూ టూత్ కనెక్టివీటి ద్వారా యాక్సెస్ చేయగలిగే వివిధ స్మార్ట్ ఫంక్షన్లతో కూడిన టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ ను ఏలుతున్న ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టాతో యాక్టివా పోటీ పడనుంది. ప్రస్తుతం ఐసీఈ విభాగంలో యాక్టివా 110 దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతోంది. కానీ ఈవీ విభాగంలో ఓలా, టీవీఎస్, బజాజ్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. దీంతో ఆ విభాగంలోనూ తన స్థానాన్ని నిలుపుకోవాలని యాక్టివా భావిస్తోంది. మరో నాలుగు, ఐదు నెలలో యాక్టవా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం రహదారులపై పరుగులు పెట్టనుంది. జపాన్ లో డెవలప్ చేసిన ఈ స్కూటర్ ను మన దేశంతో పాటు ఆసియాలోని కొన్ని మార్కెట్లలో విడుదల చేస్తారు.