ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులను (New Ration Cards ) జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నూతన సంవత్సర (New Year Gift) కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ కొత్త రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి, అలాగే కొత్తగా వివాహమైన జంటలకు అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను సరికొత్త డిజైన్లో రీడిజైన్ చేసి, పాత మరియు కొత్త లబ్ధిదారులందరికీ అందజేయనున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వివిధ డిజైన్లను పరిశీలిస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫీచర్లతో ఉండే అవకాశం ఉంది. తద్వారా కార్డులను ఉపయోగించడం మరింత సులభం అవుతుంది. పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రకారం, ఈ కొత్త డిజైన్ ద్వారా రేషన్ డేటాను మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చు. పాత కార్డులను సరికొత్త డిజైన్తో ప్రతిరూపం చేసి అందించడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు సులభం అవుతుంది. ఇది రేషన్ సరఫరా వ్యవస్థలో లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా భద్రపరచడమే కాకుండా, అవినీతి నిరోధక చర్యలలో ఒక కీలకభాగం అవుతుందని భావిస్తున్నారు.