పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ బిగ్ షాట్

www.mannamweb.com


తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అందులోనే ఉంటూ నాలుగున్నర దశాబ్దాల రాజకీయాన్ని పూర్తి చేసుకున్న విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో విరామం ప్రకటిస్తున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఇక తన రాజకీయ జీవితం చాలు అనేశారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేయను అని స్పీకర్ గా ప్రస్తుతం కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు. తనకు కూడా వయసు పెరుగుతోందని అన్నారు. తాను సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూశాను అన్నారు.

పదవులు అధికారాలు ఎవరికీ శాశ్వతం కావని ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తమ పదవీ కాలంలో చేసిన మంచి పనులే వారిని చిరస్థాయిగా ఉంచుతాయని ఆయన అన్నారు. తాను 2029 లోగా చేయాలనుకున్న మంచి పనులు ప్రజలకు చేస్తాను అన్నారు.

ఈ విషయంలో ఒళ్ళు దాచుకునే ప్రసక్తి లేదని అన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా తనకు నాలుగేళ్ల ఎనిమిది నెలల పదవీ కాలం ఉందని, ఈ పదవీ కాలాన్ని తాను ప్రజా సంక్షేమం కోసమే పూర్తి స్థాయిలో వినియోగిస్తాను అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు విశాఖలో ఉన్న వేళ అదే జిల్లాకు చెందిన నేత, బాబు కంటే టీడీపీలో ముందు నుంచి ఉన్న అత్యంత సీనియర్ నాయకుడు అయిన అయ్యన్న ఈ విధంగా ప్రకటన చేయడం పట్ల చర్చ సాగుతోంది. అయ్యన్న పాత్రుడు నిజానికి ఈ మాటను ఇపుడే కొత్తగా చెప్పడం లేదు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని చెప్పేశారు.

అయితే అవి టీడీపీకి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి అధినాయకత్వం ఆయననే పోటీకి పెట్టింది. ఇక 2024లో కూడా తన కుమారుడికే టికెట్ ఆయన అడిగినట్లుగా కూడా ప్రచారం సాగింది. కానీ హై కమాండ్ మాత్రం అయ్యన్న పోటీలో ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో ఆయన పోటీ చేశారు. మంచి మెజారిటీతో గెలిచారు

ఇక అయ్యన్న మంత్రి పదవిని ఆశించారు అని అంటారు. కానీ ఆయనకు రాజ్యాంగ బద్ధమైన పదవి లభించింది. స్పీకర్ గా అయ్యన్న తన వంతుగా హుందాతనాన్ని పాటిస్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగా ఆయన ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు అయితే చేయడం లేదు.

ఈ క్రమంలో అయ్యన్న తన పెద్ద కుమారుడు విజయ్ ని రాజకీయ వారసుడిగా చూడాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో అయ్యన్న కుమారుడే టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉంటారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే అయ్యన్న చేసిన ఈ ప్రకటన మాత్రం టీడీపీ వర్గాలలో చర్చకు తెర లేపనుంది. ఇంకా 2029 ఎన్నికలు ఎంతో దూరంలో ఉండగా అయ్యన్న ఎందుకు ఇపుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా అంతటా చర్చగా సాగుతోంది. మంత్రి పదవి లభించలేదన్న అసంతృప్తి ఏమైనా ఆయనకు ఉందా అన్నది కూడా హాట్ డిబేట్ గా ఉంది.

అయితే రాజకీయంగా ముందు చూపు వ్యూహాలు కలిగిన అయ్యన్న పాత్రుడు అన్నీ ఆలోచించిన మీదటనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీ మంత్రివర్గం మరో రెండేళ్ల తరువాత అయినా విస్తరిస్తారు అని అంటున్నారు. అప్పటికి అయినా మంత్రిగా పనిచేయాలన్న ప్లాన్ ఏదైనా అయ్యన్నకు ఉందా అన్నది కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి చూస్తే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా చెప్పని అయ్యన్న ఇపుడే సరైన సమయం అన్నట్లుగా ప్రకటిచిందడం అంటే దాని వెనక ఏమి వ్యూహాలు ఉండి ఉంటాయన్న చర్చకు అయితే తెర లేస్తోంది.