ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. సబ్సిడీకి వంట నూనె, కంది పప్పు, పంచదార..

www.mannamweb.com


ఏపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కందిపప్పు, పంచదారను సబ్సిడీ ధరలకు అందించాలని నిర్ణయించింది. పామాయిల్ కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు అందించనుంది.. ధరల స్థిరీకరణ కోసం 500 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు.

ఏపీలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలపై ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా పామాయిల్‌ అమ్మకాలను చేపట్టనుంది. ఈ మేరకు సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరల పరిస్థితిని మంత్రులు, అధికారులు సమీక్షించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించింది కమిటీ. టమాటా, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది.

పెరిగిన వంటనూనె ధరలు సామాన్యులకు భారంగా మారినట్టు మంత్రుల కమిటీ గుర్తించింది. పెరిగిన వంటనూనె ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లీటర్ పామాయిల్ 110 రూపాయలకు ప్రజలకు అందించనుంది.

రైతు బజార్‌తో పాటు రాష్ట్రంలోని 2200 రిటైల్ అవుట్ల ద్వారా సబ్సిడీ ధరలకు నిత్యావసరాల అమ్మకాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కందిపప్పు కేజీ 67 రూపాయలు, పంచదార అర కేజీ 16 రూపాయలకు అందించనుంది.

ధరల స్థిరీకరణ కోసం 500 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గత నెలలో సబ్సిడీలో టమాటా, ఉల్లిపాయలు అమ్మడంతో ధరలు దిగివచ్చాయని అధికారులు చెబుతున్నారు.