నిజం కాబోతున్న ప్రధాని మోదీ నినాదం.. సామాన్యుడికి అందుబాటులో విమానాశ్రయాలు

www.mannamweb.com


విమాన ప్రయాణం ఒకప్పుడు ధనికవర్గాలకు మాత్రమే సాధ్యం. కానీ ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు సైతం విమాన ప్రయాణాలు చేయగల్గుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం ద్వారా ద్వితీయ శ్రేణి నగరాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి.

“హవాయి చెప్పులు వేసుకునేవారు కూడా ‘హవాయి జహాజ్’ (విమానం)లో ప్రయాణం చేయాలి” అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదం దాదాపు నిజమైంది. విమాన సేవల్లో పోటీ కారణంగా టికెట్ ధరలైతే సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి.. కానీ విమానాశ్రయాల్లో కనీసం మంచి నీళ్లు తాగడానికి కూడా ఆలోచించే పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే.. బయట మార్కెట్లో రూ. 20 ధరకు దొరికే 1 లీటర్ మంచినీళ్ల బాటిల్ కోసం విమానాశ్రయంలో రూ. 100కు పైగా చెల్లించాల్సి వస్తోంది. బయట రూ. 10కి దొరికే సమోసాను విమానాశ్రయాల్లో రూ. 100కు పైగా ధరతో విక్రయిస్తూ ఉంటారు. ఒక కప్పు టీ లేదా కాఫీ తాగాలన్నా రూ. 100కు పైగానే జేబుకు చిల్లు పడుతోంది. ఎయిరిండియా, విస్తారా వంటి సంస్థలు విమాన ప్రయాణంలో ఆహారాన్ని ఉచితంగానే అందిస్తున్నప్పటికీ.. మిగతా విమానయాన సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి.

దీంతో చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజలు నోరు కట్టేసుకుని విమాన ప్రయాణాలు చేస్తుంటారు. విమానాల్లో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ పేరుతో ధనిక, మధ్యతరగతి వర్గాలకు తగిన ధరలతో తగిన సేవలు అందజేస్తున్నప్పటికీ.. విమానాశ్రయాల్లో మాత్రం మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో లభించే ఒక్క ఫుడ్ స్టాల్ కూడా కనిపించదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఈ దిశగా సన్నాహాలు చేస్తోంది.

ఎయిర్‌పోర్టుల్లో ఎకానమీ ఫుడ్ జోన్

విమానాశ్రయాల్లో ప్రపంచవ్యాప్త రుచులు, వంటకాలను అందించే అనేక రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు ఉంటాయి. అక్కడ లభించే ఆహార పదార్థాలకు బయట చెల్లించే ధరలతో పోల్చితే కనీసం 4 రెట్లు అధిక ధరలు వసూలు చేస్తుంటాయి. చివరకు చిన్న ఫుడ్ స్టాల్‌లో ఇడ్లీ, సమోసా వంటి అల్పాహారానికి కూడా బయటి ధరలతో పోల్చితే కనీసం నాలుగింతలు అధిక ధర చెల్లించాల్సి వస్తుంది. ఖరీదైన ఆహారం సాధారణ విమాన ప్రయాణికులపై అధిక భారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితిని నివారించడం కోసమే కేంద్ర పౌరవిమానయాన శాఖ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఆ ప్రకారం ప్రతి విమానాశ్రయంలో ఎకానమీ ఫుడ్ జోన్ ఏర్పాటు చేసి, అక్కడ సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తోంది.

తొలి దశలో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. విమానాశ్రయాల్లో అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది. చదరపు అడుగుల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేస్తే.. ఆయా రెస్టారెంట్లు మరింత ఎక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అక్కడ రెస్టారెంట్లను ఏర్పాటు చేసే సంస్థలు ఎక్కువ ధరకు ఆహార పదార్థాలను విక్రయించాల్సి వస్తోంది. ఎకానమీ జోన్‌లో సీటింగ్ ఏర్పాటు లేకుండా కేవలం ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. సెల్ఫ్ సర్వీస్, టేక్ ఎవే తరహాలో ఇక్కడ ఆహారాన్ని అందిస్తారు. ప్రయాణికులు కౌంటర్‌లో ఆహారాన్ని తీసుకుని నిలబడి లేదా కామన్ ఏరియాలో కూర్చుని తినవచ్చు. లేదా తమతో పాటు విమానంలోకి తీసుకెళ్లి తినవచ్చు.

ఈ తరహాలో సేవలు అందించేందుకు AAI విమానశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థలు, కొత్త ఏజెన్సీలతో సంప్రదింపులు ప్రారంభించింది. కొత్తగా నిర్మించే విమానాశ్రయాల్లో ఎకో ఫుడ్ జోన్ల కోసం కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే కార్యకాలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో తర్వాతి దశలో ఎకానమీ ఫుడ్ జోన్ల కోసం అవసరమైన స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.