ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ ఒక ప్రత్యేకమైన డిస్ప్లేను ప్రవేశపెట్టింది. దీనిని సాగదీయవచ్చు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా 50 శాతం వరకు సాగదీయగలగడం దీని ప్రత్యేకత.
డిస్ప్లే అంటే ఎటు కదలదు అని అందరికీ తెలుసు. అయితే ఇకపై డిస్ప్లే స్కీన్‌ను సాగదీయవచ్చు. ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ ఈ డిస్ప్లేను ప్రవేశపెట్టింది. దీన్ని సాగదీయవచ్చు, విస్తరించవచ్చు. దక్షిణ కొరియా కంపెనీ ఎల్జి ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రూలీ స్ట్రెచబుల్ డిస్ప్లే ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. 50 శాతం వరకు సాగదీయగలగడం దీని స్పెషాలిటీ. ప్రోటోటైప్ 12-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 18 అంగుళాలకు విస్తరిస్తుంది. అదే సమయంలో అంగుళానికి 100 పిక్సెల్స్ అధిక రిజల్యూషన్, ఆర్జీబీ రంగులను కూడా ఇస్తుంది. అయితే ఎల్జీ స్ట్రెచబుల్ డిస్ప్లేతో రావడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీ 2022లో కూడా ప్రవేశపెట్టింది. కానీ దాని గరిష్ట పొడిగింపు రేటు 20 శాతం మాత్రమే.
ఎల్జీ తన ఆవిష్కరణను అల్టిమేట్ డిస్ప్లే టెక్నాలజీ అని పిలుస్తోంది. వంచడం, మడతపెట్టే ప్రస్తుత ఫ్లెక్సిబుల్ డిస్ప్లేల మాదిరిగా కాకుండా.. ఈ డిస్ప్లేను సాగదీయవచ్చు. వివిధ పరిమాణాల్లోకి లాగవచ్చు. దీనితో ప్రయోజనం ఏంటంటే వివిధ రంగాలలో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. 2020లో ప్రారంభించిన డిస్ప్లే.. వాణిజ్య, పారిశ్రామిక, ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే జాతీయ ప్రాజెక్టులో భాగంగా ఈ అభివృద్ధి జరిగింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న 19 పరిశోధనా సంస్థల కన్సార్టియానికి ఎల్జీ డిస్ప్లే నేతృత్వం వహిస్తుంది.
మెుదట్లో ఈ డిస్ప్లే లక్ష్యం 20 శాతం ఎలివేషన్ రేటు అయినప్పటికీ ఈ టీమ్ కొత్త పద్ధతుల ద్వారా దానిని విజయవంతంగా రెట్టింపు చేసింది. కాంటాక్ట్ లెన్సులలో సాధారణంగా ఉపయోగించే ప్రత్యేక సిలికాన్ సబ్‌స్ట్రేట్ మెటీరియల్, వైరింగ్‌ను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన విధానం వీటిలో ఉన్నాయి.
ఈ ప్రోటోటైప్ పదేపదే లాగినప్పుడు కూడా 10,000 సార్లు నిలబడగలదని ఎల్జీ డిస్ప్లే పేర్కొంది. ఇది కాకుండా డిస్ప్లే 40 మైక్రోమీటర్ల మైక్రో-ఎల్ఈడీ లైట్ సోర్స్‌ను కలిగి ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలతోపాటుగా ఇతర పరిస్థితుల్లోనూ ఇమేజ్ నాణ్యతను కాపాడుతుంది.
సాగతీతతో పాటు ఈ డిస్ప్లే సన్నగా, తేలికగా ఉంటుంది. దుస్తులు లేదా చర్మం వంటి ఉపరితలాలకు అంటించుకోవచ్చు. ఫ్యాషన్, వేరబుల్స్ నుంచి మొబిలిటీ సెక్టార్ వరకు వివిధ పరిశ్రమల్లో ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుకోవచ్చని ఎల్జీ భావిస్తోంది.