ఏపీ రైతులు ఒక్కొక్కరి ఖాతాలో రూ.20వేలు.. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కీలక ప్రకటన

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. రూ.43,402 కోట్లతో సభ ముందు బడ్జెట్‌ను ఉంచారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక.. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని తెలిపారు. రాష్ట్రంలో భూసార పరీక్షలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామని.. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా తక్కువ ధరకే ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే ఈ బడ్జెట్‌లో రైతులకు ప్రతి ఏటా రూ.20వేలు అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం ‘సూపర్‌ సిక్స్‌’ కార్యక్రమం కింద రైతులకు ‘అన్నదాత సుఖభీభవ.. పీఎం కిసాన్ పథకం’లో ఏడాదికి రూ. 20 వేల చొప్పున (పీఎం కిసార్ పథకం కింద కేంద్ంరఅందించే రూ. 6000 ప్రయోజనంతో కలిపి)ఆర్థిక సహాయం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం అమలుకు రూ.4,500 కోట్లు ప్రతిపాదించామన్నారు రాష్ట్రంలోని భూమిలేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపు నుంచి అందిస్తామన్నారు. ఈ అన్నదాతీ సుఖీభవ పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వ ఆదేశాలు త్వరలో జారీ చేస్తుందని చెప్పారు.

అలాగే 2024-25లో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం రూ.2,64,000 కోట్లు (పంట రుణాల కింద రూ. 1లక్ష 66 వేల కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద రూ. 98 వేల కోట్లు) అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఇప్పటివరకు పంట రుణాల కింద రూ.1,03,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా వ్యవసాయ టర్మ్‌ రుణాల కింద రూ.66148 కోట్లు మొత్తం రూ.1,69,797 కోట్లు పంపిణీ చేశారన్నారు.

కౌలు రైతులకు ఈ ప్రభుత్వం 9.08 లక్షల పంట సాగుదారుల హక్కుల కార్డుల్ని జారీ చేసింది అన్నారు. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు వీలు కల్పించింది అన్నారు. 2024-25లో సం.లో CCRCలు పొందిన కౌలు రైతులకు రూ. 1443 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశామన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి.. అర్హులైన కౌలు దారులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు 2024లో కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు.

రూ.3 లక్షల వరకు పంట రుణాలు పొంది, నిర్ణీత వ్యవధి ( ఒక ఏడాది)లో తిరిగి చెల్లించే అర్హలైన రైతులందరికీ 2024-25 నుంచి వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. వడ్డీ రాయితీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. రూ.3 లక్షల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు .. వడ్డీ లేని రుణాలు పథకం కింద రూ.1 లక్ష వరకు పంట రుణం మొత్తంపై 4శాతం వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. పావలా వడ్డీ రుణాల పథకం కింద రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పంట రుణ మొత్తంపై 1శాతం వడ్డీ రాయితీని అందజేస్తుంది అన్నారు. 2024-25లో వడ్డి లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో రూ. 628 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులిలా..
అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు
పంటల బీమా – రూ.1,023 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
ఉద్యాన శాఖ – రూ. 3469.47 కోట్లు
పట్టు పరిశ్రమ – రూ.108.4429 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ – రూ.314.80 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్ – రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానం – రూ.5,150కోట్లు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు
భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు.
ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
వడ్డీ లేని రుణాలకు – రూ.628 కోట్లు
సహకార శాఖ – రూ.308.26కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం – రూ.507.038 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయం – రూ.102.227 కోట్లు
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
మత్స్య విశ్వవిద్యాలయం – రూ.38 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,095.71 కోట్లు
మత్స్య రంగం అభివృద్ధి – రూ.521.34 కోట్లు
ఎన్టీఆర్ జలసిరి – రూ.50 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు