వైఎస్ జగన్ ఆస్తుల కేసు.. సుప్రీం కోర్టు కీలక పరిణామం, ఆదేశాలు జారీ

www.mannamweb.com


వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఈ కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో కోర్టుకు మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది. డిసెంబర్‌ 2న జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు పంపాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

వాస్తవానికి రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సీజేఐ ధర్మాసనం ముందుకు విచారణకు వెళ్లింది. అయితే ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సభ్యుడు కాగా.. విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అని జగన్ తరఫు లాయర్ తెలిపారు. తమకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫున లాయర్ కోరారు. అయితే జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అన్నారు.. దీంతో ఈ పిటిషన్‌లపై విచారణను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించవద్దని చెప్పారు.. కానీ పొరపాటున ఇవాళ లిస్ట్ చేసినట్లు సీజే తెలిపారు.

ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఆగస్టులో విచారణ జరిపింది.. సీబీఐ మే నెలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించింది. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్ల అంశాన్ని కోర్టుకు వివరించింది సీబీఐ. ఈ కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జిలు కూడా మారిపోతున్నారని.. సీబీఐ కోర్టులో తాజా న్యాయమూర్తి రెండేళ్లు కాకుండానే బదిలీ అయ్యారని కోర్టుకు చెప్పారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల అంశాన్ని రఘురామ తరఫు లాయర్ కూడా ప్రస్తావించారు.. ఆ తర్వాత జరిగిన విచారణ సంగతి తెలిసిందే.

ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్‌ చేపట్టాలని న్యాయమూర్తి సూచించారు. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని.. వాటిని అనుసరించాల్సిందేనని.. అవే సీబీఐకి కూడా వర్తిస్తాయని చెప్పారు. అయితే తాజాగా జరిగిన విచారణలో.. సుప్రీం కోర్టు జగన్ ఆస్తుల కేసులో రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ధర్మాసనాన్ని మార్చింది.