ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవగా.. తుది గడువు నవంబర్ 11వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 21వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా ప్రకగన జారీ చేశారు.
రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. మొదటి లేదా రెండో ఏడాది చదివే విద్యార్ధులు జనరల్ థియరీ సబ్జెక్టులకు రూ. 600, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ. 275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ. 165 చొప్పున ఫీజు చెల్లించాలని వెల్లడించారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి థియరీ పరీక్షలకు రూ. 1200 చెల్లించాలని ఆమె సూచించారు. హాజరు మినహాయింపు కోరేవారు ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని, వీరు నవంబరు రూ. 1500 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇక ఇంటర్మీడియల్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండోవారంలో ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటితోపాటు నైతికత, మానవ విలువలు, పర్యావరణ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.
నవంబర్ 23న ఎస్‌బీఐ ఎస్‌ఓ నియామక రాత పరీక్ష.. త్వరలో అడ్మిట్‌కార్డులు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నియామక రాత పరీక్ష తేదీ విడుదలైంది. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 23వ తేదీన ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే విడుదలకానున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.