బిట్ కాయిన్ అంటే 2009లో ప్రారంభమైన క్రిప్టో కరెన్సీ. దీన్ని ఎవరు కనిపెట్టారో తెలియదు. ఈ కరెన్సీ ద్వారా మధ్యవర్తులు లేకుండా లావాదేవీలు జరుగుతాయి.
బిట్ కాయిన్ ధర 2017లో వేలల్లోకి దూసుకువెళ్లింది. మొబైల్ యాప్ లు, కంప్యూటర్లను ఉపయోగించి ఒకరికొకరు బిట్ కాయిన్లను పంపుకోవచ్చు. ప్రస్తుతం నగదును పంపుతున్న విధానంలోనే ఇది కూడా ఉంటుంది. బిట్ కాయిన్లు ఏ దేశానికి సంబంధించినవి కావు. వాటిపై ఎటువంటి నియంత్రణ ఉండదు. అంతర్జాతీయ చెల్లింపులు సులభంగా, చౌకగా జరుగుతాయి. వర్చువల్ కరెన్సీ అయిన దీనిపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఇవి 21 మిలియన్లు మాత్రమే ఉండాలని పరిమితి ఉంది. 2016 నాటికి 16.4 మిలియన్లు ఉనికిలో ఉన్నట్టు సమాచారం. కొందరు బిట్ కాయిన్లను కొనుగోలు చేయడాన్ని పెట్టుబడిగా కూడా భావిస్తారు. దీన్ని క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు.
ట్రంప్ విజయంతో బిట్ కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీ లు ముందుకు దూసుకుపోతాయని క్రిప్టో పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన మద్దతుదారులలో ఒకరైన ప్రపంచ కుబేరుడు ఎలోన్ మాస్క్ కూడా క్రిప్టో కరెన్సీకి మద్దతు తెలుపుతున్నారు.
డోనాల్డ్ ట్రంప్ మొదట్లో బిట్ కాయిన్ పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన ఆలోచనను మార్చుకుని దానికి మద్దతు తెలిపారు. ట్రంప్, అతడి పిల్లలు సెప్టెంబర్ లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్ అనే కొత్త క్రిప్టో వ్యాపారాన్ని ప్రారంభించారు. దానిపై ట్రంప్ మాట్లాడుతూ క్రిప్టో పరిశ్రమ ప్రస్తుతం చిన్నగానే ఉన్నా భవిష్యత్తులో విస్తరిస్తుందని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత బిట్ కాయిన్ విపరీతంగా లాభపడింది. దాదాపు 30 శాతం దాని ధర పెరిగింది. యూఎస్ ఎన్నికల ఫలితాల నుంచి వారం రోజులో బిట్ కాయిన్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 350 శాతం పెరగడం విశేషం. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ కోడ్ ల ద్వారా పనిచేస్తాయి. రూపాయి, డాలర్ మాదిరిగా భౌతికంగా ఉండవు. డిజిటల్ రూపంలో మాత్రమే చెలామణి అవుతాయి. మన దేశంలో క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నిషేధం లేదు. హోల్దింగ్, ట్రేడింగ్ పరంగా వీటిని వినియోగించుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన నిర్మాణాత్మక ఫ్రేమ్ వర్క్ ఇంకా డెవలప్ కాలేదు. క్రిప్టో కరెన్సీలు, ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏలు) బదిలీ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని 2022 యూనియన్ బడ్జెట్ లో పేర్కొన్నారు. దానికి అదనంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు (నిర్దిష్ట సమయాల్లో రూ.పదివేలు) కంటే ఎక్కువ క్రిప్టో ఆస్తుల విక్రయంపై ఒక శాతం టీడీఎస్ వర్తింజజేస్తారు. వేజిరిక్స్, కోయిన్ స్విచ్, కోయిన్ డీసీఎక్స్, జెబ్ పే తదితర ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ లలో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయవచ్చు.