విపక్ష హోదా ఇవ్వాలన్న జగన్.. అదేం లెక్క అన్న సీఎం చంద్రబాబు

www.mannamweb.com


అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే సభకు వెళ్లడం లేదని వైసీపీ చెబుతుండగా..

10శాతం సీట్లు గెలుచుకోని పార్టీకి విపక్ష హోదా ఎలా ఇస్తారని టీడీపీ ప్రశ్నిస్తో్ంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది. తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే సభకు వెళ్లడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీ లేదన్నారు జగన్. వైసీపీకి 40 శాతం ఓట్లు వేసి ప్రజలు ప్రతిపక్షంగా గుర్తించారన్నారు. కూటమి ప్రభుత్వం తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు జగన్‌.

వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10శాతం స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్నారు. ప్రజలు గత ఐదేళ్ల జగన్‌ పాలన చూసి 11 సీట్లే ఇచ్చారు. ప్రజలే వైసీపీకి విపక్ష హోదా లేకుండా చేశారన్నారు. పట్టుమని 10శాతం అసెంబ్లీ సీట్లు గెలవని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే నేతను తాను ఇప్పటివరకు చూడలేదన్నారు సీఎం చంద్రబాబు.

మరోవైపు, వైసీపీ సభకు వెళ్లకపోవడంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. వైసీపీకి-కాంగ్రెస్‌కు మధ్య తేడా ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే సభకు రావాలంటున్నారు బీజేపీ నేతలు. సభకు రాకుండా ప్రెస్‌మీట్లు పెడితే లాభం ఉండదంటున్నారు.