ఏపీలో మద్యం కనీస ధర ఖరారుకు టెండర్ కమిటీ ఏర్పాటైంది. రిటైర్డ్ హైకోర్డు జడ్జి సునీల్ చౌదరి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా, మాచారావుని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసే మద్యానికి కనీస ధరను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే మద్యం కొనుగోలుకు సంబంధించి ఈ కమిటీ కొత్త మార్గదర్శకాలు సిఫార్సు చేయనుంది.
అటు శాసనమండలిలో మంత్రి కోల్లు రవీంద్ర లిక్కర్ పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గొప్ప లిక్కర్ పాలసీ ఏపీలో ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అంతేకాదు లిక్కర్ రేట్లు తగ్గించే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిందన్నారు కొల్లు. వైసీపీ హయాంలో 18వేల కోట్ల దోపిడీ జరిగిందన్న కొల్లు.. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో రేట్లు తక్కువ ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.