హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకీ జనాభా శాతం పెరిగిపోతుంది. చాలా మంది బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ప్రయాణాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజు నగరంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ని ఇండోర్ తరహాలో క్లీన్ సిటీగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందు కోసం కార్పోరేషన్ అధికారులను ఇండోర్ కి వెళ్లి అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో చాలా కాలంగా సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారి సంఖ్య పెరిగిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా.. చలాన్లు విధించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. అలాంటి వారిని కట్టడి చేయడమే ట్రాన్స్ జెండర్ల బాధ్యత. విధుల్లో ఉండేవారికి హూం గార్డులకు ఇచ్చినట్లే జీతభత్యాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉండబోతుందట. సాధ్యమైనంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ట్రాఫిక్ విదులు నిర్వహించాలన్న ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలన్నారు.
తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవమైన జీవితం జీవించాలని పలు సందర్భాల్లో అన్నారు. ఇప్పటికే ట్రాన్స్ జెండర్లకు ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లీనిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే మైత్రి క్లీనిక్ సేవలు ప్రారంభించనున్నారు. వారానికి రెండురోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు. మరి రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ట్రాఫిక్ నియంత్రణ ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.