చాప కింద నీరులా విస్తరిస్తున్న ఫ్యాటీ లివర్‌.. ఏం చేయాలి

www.mannamweb.com


మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, శరీరానికి శక్తిని అందించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరిలో ఒక్కరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఫ్యాటీ లివర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వారు అంటున్నారు. అయితే అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ఇది వచ్చేందుకు అసలు కారణాలు ఏమిటి.. అన్న వివరాలను వైద్యులు చెబుతున్నారు.

లివర్‌లో పేరుకుపోయే కొవ్వు..

మనం ఆహారం తిన్నప్పుడు దాన్ని శరీరం ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌గా లివర్ విడగొడుతుంది. ఈ క్రమంలో లివర్ శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీర అవసరాలకు సరిపోగా మిగిలిన పోషకాలతో లివర్ హార్మోన్లు, ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా పోషకాలు మిగిలిపోతే లివర్ వాటిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకుంటుంది. అయితే శరీర అవసరాల కన్నా ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారాలను తింటే శరీరానికి క్యాలరీలు అధికంగా లభిస్తాయి. అవన్నీ లివర్‌లో కొవ్వుగా మారుతాయి. దీర్ఘకాలంలో ఇది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది.

శరీరం ఇచ్చే సంకేతాలు..

లివర్‌లో 5 శాతం కొవ్వు ఉంటే దాన్ని స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ డిసీజ్‌గా చెబుతారు. అదే 50 శాతం దాటితే దాన్ని అడ్వాన్స్‌డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ స్టేజ్‌కు వస్తే సాధారణంగా లివర్ పనిచేయదు. అది క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. దీంతో పరిస్థితి ప్రాణాంతకం అవుతుంది. కనుక లివర్ లో ఫ్యాట్ పేరుకుపోయినప్పుడు అది ఇచ్చే సంకేతాలను బట్టే మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దీంతో లివర్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. లివర్‌లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే శరీరం మనకు పలు సంకేతాలను ఇస్తుంది.

నిర్లక్ష్యం వద్దు..

లివర్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటే తీవ్రమైన అలసట ఉంటుంది. సడెన్‌గా బరువు తగ్గిపోతారు. పొట్టలో అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది. నీరసం ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువగా ఆందోళన, కంగారు ఉంటాయి. కొందరికి కామెర్లు కూడా అవుతాయి. అలాంటప్పుడు చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కళ్లు కూడా పసుపు రంగులోకి మారి కనిపిస్తాయి. అలాగే చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంటుంది. పొట్ట ఉబ్బిపోయి కనిపిస్తుంది. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాంతకం కాకుండా బయట పడవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..

లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా అస్తవ్యవస్తమైన జీవన విధానం వల్లే వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదా డయాబెటిస్ ఉన్నవారికి, మద్యం ఎక్కువగా సేవించేవారికి, పొగ తాగేవారికి కూడా వస్తుందని అంటున్నారు. అధిక బరువు ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఫ్యాటీ లివర్ వచ్చిన వారు డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడంతోపాటు ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీంతో ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్‌, నూనె పదార్థాలను మానేయాలి. మద్యం సేవించరాదు, పొగ తాగరాదు. తాజా ఆకుకూరలు, పండ్లు, నట్స్ తినాలి. ఈ జీవనశైలిని పాటిస్తే ఫ్యాటీ లివర్ నుంచి త్వరగా బయట పడతారు.